
వందేభారత్.. నష్టాల ప్రయాణం
రెండు జిల్లాల్లో ఒక్క హాల్టింగ్ కూడా లేని రైలు..
ఆక్యుపెన్సీ సాధించడంలో విఫలం
పట్టించుకోని రైల్వే అధికారులు
విజ్ఞప్తులతోనే సరిపెడుతున్న ప్రజా ప్రతినిధులు
● రెండు జిల్లాల్లో ఒక్క హాల్టింగ్ కూడా లేని రైలు.. ● ఆక్యుపెన్సీ సాధించడంలో విఫలం ● పట్టించుకోని రైల్వే అధికారులు ● విజ్ఞప్తులతోనే సరిపెడుతున్న ప్రజా ప్రతినిధులు
బెల్లంపల్లి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్–సికింద్రాబాద్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వందశాతం ఆక్యుపెన్సీ లక్ష్య సాధనలో వెనుకంజలో ఉంది. డిమాండ్ ఉన్న రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికుల ఆదరణ కరువవుతోంది. ఈ మార్గంలో వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని ఎంతగానో ఆరాటపడిన ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్ తర్వాత సేవాగ్రామ్ (వార్దా), చంద్రపూర్, బల్లార్షా రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించిన రైల్వే అధికారులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఏ ఒక్క రైల్వేస్టేషన్‌లోనూ నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయకపోవడం రైలు ప్రయాణికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చంద్రపూర్–బల్లార్షా మధ్య కేవలం 13 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఆప్రాంతంలో నిరభ్యంతరంగా హాల్టింగ్‌కు పచ్చజెండా ఊపి పదుల కిలోమీటర్ల దూరం ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని రైల్వేస్టేషన్‌లను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల మూడు ప్రధాన రైల్వేస్టేషన్‌లతో పాటు జిల్లా కేంద్రమైన పెద్దపల్లి రైల్వే జంక్షన్‌లోనూ హాల్టింగ్‌కు ఉత్తర్వులు జారీ చేయాలన్న ప్రయాణికుల డిమాండ్‌ను రైల్వే అధికారులు పెడచెవిన పెట్టారు. బల్లార్షా తర్వాత రామగుండం, కాజీపేట జంక్షన్‌లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. రామగుండంలో ఈ రైలు ఎక్కే ప్రయాణికులు అంతంత మాత్రమే. కాజీపేటలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉండటం వల్ల వందేభారత్ రైలు సక్సెస్ కాలేకపోతోందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆక్యుపెన్సీ సాధనలో వెనుకంజ
వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు గతేడాది ప్రారంభం కాగా ఇప్పటికీ వందశాతం ఆక్యుపెన్సీ సాధించలేదు. అనాలోచిత నిర్ణయాలతో రైలును ఆదిలో 20 కోచ్‌లతో ప్రారంభించారు. అయితే ప్రయాణికుల ఆదరణ ఆశాజనకంగా లేక పోవడంతో క్రమంగా ఆక్యుపెన్సీ తగ్గుతూ వచ్చింది. ఫలి తంగా గత ఫిబ్రవరి మూడో వారంలో కోచ్‌లను ఒక్కసారిగా 20 నుంచి 8కి కుదించారు. పరిమిత సంఖ్యలో కోచ్‌లు ఉండటంతో ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో క్రమంగా 70 శాతం వరకు పెరగడం కాస్త ఊరటనిస్తుండగా వందశాతం సాధించే దిశగా పరుగులు పెట్టలేకపోతోంది.
వందేభారత్ రైలు