‘బెస్ట్’ నిర్వహణ భారమే..!
● బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల బకాయిలు రూ.3.22 కోట్లు ● కొత్త పాఠశాలల ఎంపికకు కసరత్తు
మంచిర్యాలఅర్బన్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల(బీఏఎస్)కు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఏళ్ల తరబడి సకాలంలో విడుదల కాక బీఏఎస్ నిర్వహణ భారంగా మారుతోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఏఎస్ ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో 2025–26 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల కింద ప్రైవేటు పాఠశాలల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. సదుపాయాలు, భవనం ప్రణాళిక, అగ్నిమాపక భద్రత, ఐదేళ్ల ఉత్తీర్ణత శాతం, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మరో నాలుగు పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా సౌకర్యాలు, పేరున్న పాఠశాలలు తక్కువేనని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం బెస్ట్ అవైలబుల్ కింద నిర్వహిస్తున్న పాఠశాలలకు బకాయిలు పేరుకుపోవడంతో స్కూళ్లు నడపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తుస్తుండంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో ఇలా..
జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల కింద ఐదు ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి. రివిలేషన్ స్కూల్, మదర్‌థెరిస్సా, ట్రినిటీ, బ్రిలియంట్, శ్రీచైతన్య(దొనబండ) పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఒకటో తరగతిలో చేరిన వారు ఇంటి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఐదో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ పదో తరగతి వరకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. ఒకటో తరగతిలో 91 సీట్లు, ఐదో తరగతిలో 92 సీట్లు ఉంటాయి. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల కింద ప్రవేశం పొందిన డే స్కాలర్ విద్యార్థికి రూ.28వేలు, హాస్టల్ సౌకర్యం ఉన్న వారికి రూ.42వేల చొప్పున యాజమాన్యాలకు చెల్లిస్తుంటారు. ప్రభుత్వం ఎప్పుడూ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వసతితో కూడిన విద్యనందిస్తున్న పాఠశాలలో చదువు మాటేలా ఉన్నా భోజనం ఖర్చులు తడిసి మోపెడు అవుతుండడం, ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేస్తుండడం వల్ల డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదని ఓ పాఠశాల నిర్వాహకుడు ఆందోళన వ్యక్తం చేశారు.
బకాయిలు
ప్రతియేటా బకాయిలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జిల్లాకు బడ్జెట్ విడుదల అవుతున్నా పాఠశాల యాజమాన్యాల ఖాతాలో చేరడం లేదు. బడ్జెట్ విడుదల కావడం, టోకెన్లు రిలీజ్ చేస్తున్నా బ్యాంకు ఖాతాలో చూస్తే మాత్రం ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. జిల్లాలో నాలుగేళ్ల వరకు కొంతలో కొంత చెల్లిస్తున్నా 2024–25నుంచి బకాయిలు ఏమాత్రం చెల్లించలేదు. రూ.1.47 కోట్లకు పైగా పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. ఐదేళ్లుగా మొత్తం రూ.4,37,66,000కు గాను రూ.1,15,47,000 చెల్లించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని, వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.


