మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు
● ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ● మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారంతా యువకులేనని, మైనర్ మొదలుకుని 35ఏళ్ల వయస్సున్న వారేనని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారిపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శనివారం నగరంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ–ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ జల్సాల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందడం బాధాకరమని, మితిమీరిన వేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మైనర్‌డ్రైవింగ్, రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని మ్యాక్స్ భవన్ వద్ద ముగ్గురు మైనర్లు ఒకే మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు చనిపోయారని తెలిపారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన వారికి, తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, సీఐ ప్రమోద్‌రావు, రూరల్ సీఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు.


