
కొనుగోళ్లు పూర్తి చేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి/లక్సెట్టిపేట: వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. దండేపల్లి మండలం కొర్విచెల్మ, నంబాల, రంగంపల్లె, లకెట్టిపేట మండలం బలరావుపేట, జెండావెంకటాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు రావాల్సిన డబ్బులు త్వరలోనే అందుతాయన్నారు. దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, దరఖాస్తులపై ఆరా తీశారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని తహసీల్దార్‌కు సూచించారు. లక్సెట్టిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రేషన్‌కార్డుల ప్రక్రియ, పేర్ల నమోదు, తొలగింపు వేగవంతం చేయాలని అన్నారు. జూన్ రెండు నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో దండేపల్లి తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్‌ఐ బొద్దుల భూమన్న, ఏపీఎం బ్రహ్మయ్య, లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర
మంచిర్యాలటౌన్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి బదులిస్తూ ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ మన వీర సైనికుల స్ఫూర్తి, దేశభక్తిని చాటేందుకు తిరంగా యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు పూర్తి చేయాలి