
పోడు సాగుదారుల గోస తీరుస్తా
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
తాండూర్: పోడు భూములు సాగు చేస్తున్న పేదల సమస్యలు తీరుస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బుధవారం మాదారం గ్రామపంచాయతీ పోచంపల్లి గ్రామంలో పోడుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి నుంచి పోడు భూములు సాగు చేస్తుండగా అటవీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని, కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అటవీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అంతలోనే అక్కడికి చేరుకున్న డెప్యూటీ రేంజ్ అధికారి జాడి తిరుపతితో ప్రత్యేకంగా మాట్లాడారు. పోడు భూములు సాగు చేస్తున్న పేదల జోలికి వెళ్లవద్దని సూచించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్ వీవీఆర్‌కేడీ ప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి, తాండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ఈసా, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్.మహేందర్‌రావు, మాజీ జడ్పీటీసీ బానయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, కొత్తపల్లి బీట్‌పరిధిలో పోడు పత్రాలు లేకుండా భూములు సాగు చేస్తున్న వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. హక్కు పత్రాలు లేకుండా భూమి సాగు చేస్తే ఊరుకునేది లేదని తాండూర్ సెక్షన్ అటవీ అధికారి సువర్ణ తెలిపారు.