
‘భూభారతి’తో సమస్యల పరిష్కారం
● కలెక్టర్ కుమార్‌దీపక్
భీమారం: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యల్లో కొన్ని ధరణిలో పరిష్కరించలేకపోయామని తెలిపారు. సాదాబైనామలకు పట్టాహక్కులు కల్పించాలని పలువురు రైతులు కలెక్టర్‌ను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. భీమారం రెవెన్యూ శివారులోని 21 సర్వే నంబర్‌లో భూమి ఉన్నవారికి పట్టాలు లేవని, పట్టాహక్కులు ఉన్న రైతులకు భూమిలేదని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందిస్తామని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సదానందంను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసిన భూములకు అమ్మకందారుల నుంచి పత్రాలు ఉంటే పట్టా చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సదానందం, ఎస్సై శ్వేత, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు ఉన్నారు.