
ఎన్‌హెచ్–44పై దారికాచిన మృత్యువు
● మూడు జిల్లాల పరిధిలో మూడు యాక్సిడెంట్లు ● నిర్మల్ జిల్లాలో తండ్రి, కూతురు దుర్మరణం ● ఆదిలాబాద్ జిల్లాలో బావ మృతి, బావమరిదికి గాయాలు.. ● కామారెడ్డి జిల్లాలో భార్య మృతి, భర్తకు గాయాలు ● మూడూ కారు ప్రమాదాలే కావడం విషాదం..
కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే ఎన్‌హెచ్ 44పై ఆదివారం మృత్యువు దారికాచింది. మూడు జిల్లాల పరిధిలో ఇదే రోడ్డుపై జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇక్కడ విషాదం ఏమిటంటే మూడు ప్రమాదాలకు కారణం కార్లే.. మూడు ప్రమాదాలు కారు డ్రైవర్ల తప్పిదంతోనే జరిగాయి. నిర్మల్ బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆగిఉన్న ఐచర్ వాహనాన్ని కారుడ్రైవర్ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బావ మృతి చెందగా, బావమరిది గాయపడ్డాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. ఈ మూడు ప్రమాదాలు ఆ కుటుంబాల కలలను, ఆశలను ఛిన్నాభిన్నం చేశాయి.
నిర్మల్ జిల్లాలో..
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని రవీంద్రనగర్‌కు చెందిన బండి శంకర్(48) బ్యాటరీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవారు. ఆయనకు కవల ఆడపిల్లలు వైదిక, కృతిక(22) ఉన్నారు. వైదిక నిజా మాబాద్‌లో వైద్య విద్య అభ్యసిస్తుండగా, కృతిక హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శనివారం కృతిక పరీక్షలు పూర్తి కావడంతో వేసవి సెలవుల కోసం ఇంటికి తీసుకురావడానికి శంకర్ తన సొంత కారులో డ్రైవర్ విలాస్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. శనివారం రాత్రి కృతికను తీసుకుని ఇంటికి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిర్మల్ జిల్లా నీలాయిపేట వద్ద వారు ప్రయాణిస్తున్న కారు, రోడ్డుపై ఆగి ఉన్న ఐచర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. శంకర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కృతికను స్థానికులు నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్ విలాస్ కాళ్లకు తీవ్ర గాయాలై, చికిత్స కోసం మహారాష్ట్రలోని ఆస్పత్రికి తరలించారు. మరో గంటలో ఇంటికి చేరి, కుటుంబంతో సంతోషంగా గడపాలన్న కృతిక ఆశలు ఈ ప్రమాదంతో ఆవిరయ్యాయి. తండ్రి, కూతురు మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. వారి రోదనలు చూసినవారిని కంటతడి పెట్టించాయి.
ఆదిలాబాద్ జిల్లాలో
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద జరిగిన మరో ప్రమాదంలో వెంకటేశ్(35) మృతిచెందాడు. నిర్మల్ జిల్లా వివేక్‌నగర్‌కు చెందిన వెంకటేశ్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అన్వేష్ బావ, బావమరిది. పని నిమిత్తం శనివారం ఆదిలాబాద్‌కు వెళ్లిన వెంకటేశ్ ఆదివారం బావమరిదితో కలిసి నిర్మల్‌కు బయల్దేరాడు. టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వారి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడి, నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అన్వేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి వద్ద గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయర్ ప్రణీత (20) మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠం గ్రామానికి చెందిన అమూల్ నేవీలో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సెలవులు రద్దు కావడంతో, ఆదివారం సాయంత్రం భార్య ప్రణీతతో కలిసి కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రణీత తీవ్రంగా గాయపడగా, అమూల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ప్రణీత మృతిచెందింది. అమూల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అమూల్, ప్రణీతకు ఏడాది క్రితం పెళ్లయింది.

ఎన్‌హెచ్–44పై దారికాచిన మృత్యువు