చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో కలిసి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం కార్యక్రమానికి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. మే 1 నుంచి 31వరకు ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడా శిబిరాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలు గుట్కా, మద్యానికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు, యువత, మహిళల ఆధ్వర్యంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షిషాలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చావ్ల, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఇన్‌చార్జి ఎంపీడీవో జీవన్‌రెడ్డి, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, పార్థసారథి, గ్రామ పటేల్ వెంకట్‌రావ్, బాదిరావ్, ఆనంద్‌రావ్ తదితరులు ఉన్నారు.


