ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు..
నెన్నెల: ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని కొత్తగూడం గ్రామానికి చెందిన యువకుడు దుర్గం బాలస్వామి(26) వ్యవసాయ పని కోసం తన సొంత ట్రాక్టర్‌తో సోమవారం నెన్నెలకు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ కింద బాలస్వామి శరీరం మొత్తం ఇరుక్కుపోయింది. గ్రామస్తులు వచ్చి అతడిని బయటకు తీసి 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తమ్ముడు జీవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి భార్య ప్రసన్న, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఒకరు..
ఆదిలాబాద్‌టౌన్: మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా పల్సితాండకు చెందిన జాదవ్ మనోజ్ (38) రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు టూటౌన్ ఏఎస్సై ఖైసర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనోజ్ మనస్తాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు రిమ్స్‌లో ఉదయం చేర్పించగా, రాత్రి మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య జయశ్రీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.


