
పాఠశాలలో విషప్రయోగం కలకలం
● తప్పిన పెను ప్రమాదం ● పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు, నిందితుడు అరెస్ట్
ఇచ్చోడ: మండలంలోని ధర్మంపూరి ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి విషప్రయోగం చేసిన ఘటన కలకలం సృష్టించింది. ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సిబ్బంది పాఠశాల తాళం పగిలిపోయి ఉండటాన్ని గమనించారు. పాఠశాల గదిలో ఉన్న వంటపాత్రలో తె ల్లనినీరు నింపి ఉండటం, వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే పాఠశాలకు చేరుకున్న గ్రామస్తులు వంటపాత్రలు, వాటర్‌ట్యాంక్‌లో విషం కలిపినట్లు గుర్తించారు. పాఠశాల ఆవరణలో ఉన్న పురుగుల మందు డబ్బాను గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పాఠశాల సిబ్బంది ముందుగా గుర్తించడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ బుధవారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు.
నిందితుడు అరెస్ట్
పాఠశాలలో వంటపాత్రలలో విషం కలిపిన దర్మంపూరి గోండుగూడకు చెందిన సోయం కిష్టును బుధవారం అరెస్ట్ చేశారు. కొంత కాలంగా కుటుంబ కలహాల కారణంగా మతిస్థిమితం కోల్పోయిన సోయం కిష్టు ఘటనకు పాల్పడినట్లు ఏఎస్పీ కాజల్‌సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలను సందర్శించిన డీఈవో
ధర్మంపూరి ప్రాథమిక పాఠశాలను బుధవారం డీఈవో శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో విష ప్రయోగం జరగడంతో పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో బిక్కు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ ఉన్నారు.