
ప్రజల కలను సాకారం చేశాం
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ప్రజల దశాబ్దాల కల అయిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిని తమ హయాంలో పూర్తి చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి క్యాతనపల్లి వద్ద నిర్మించిన ఆర్వోబీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు పలుమార్లు ఆర్‌కేపీకి వస్తే ఇక్కడి రైల్వే గేటు ద్వారా ఇబ్బందులు పడ్డానని, ప్రజల కోరిక మేరకు 2011లోనే బ్రిడ్జిని మంజూరు చేయించానని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూసేకరణ పనులు, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు జరగక పనులు పూర్తికాకపోతే చెన్నూర్ ఎమ్మెల్యేగా ఎన్నికై న తాను భూసేకరణ పనులు, పరిహారం చెల్లింపు అంశాలను వేగవంతం చేసి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోనే పనులు పూర్తి చేశానని చెప్పారు. నియోజకవర్గ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, ప్రజలు కొంత ఓపిక పట్టాలని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ణయం మేరకు అర్హులకు ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారు. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే రైల్వే గేటు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోవడం తనను ఎంతగానో బాధించిందని, బ్రిడ్జిని పూర్తి చేసేందుకు తనతోపాటు తన తండ్రి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తున్నానని, సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాము, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, రఘునాథ్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్‌గౌడ్, గాండ్ల సమ్మయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్వోబీతో కష్టాలు దూరం
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్
క్యాతనపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం

ప్రజల కలను సాకారం చేశాం