మంచిర్యాలటౌన్: భూభారతి చట్టం 2025తో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు 10,954 మంది గ్రామపాలన అధికారులు వచ్చారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సైనికులుగా పనిచేస్తామన్నారు. అనతికాలంలోనే ప్రభుత్వ సహకారంతో ఎన్నో విజయాలను సాధించుకున్నామని, తొలిసారి 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను ఏర్పాటు చేసి, పూర్వ వీఆర్‌ఏ, వీఆర్వోలను మాతృ సంస్థలోకి తీసుకోవడం గొప్ప విజయమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, టీజీటీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆలం పోచయ్య, ప్రధాన కార్యదర్శి ఆత్రం ప్రహ్లాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు కె.శ్రావణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వీ.సంజీవ్ కుమార్, ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్డీవోలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
‘భూభారతి’తో రెవెన్యూలో మార్పులు


