బాసర: బాసర ట్రిపుల్‌టీలో శుక్రవారం అంతఃప్రజ్ఞ టెక్‌ఫెస్ట్, 2025 ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ ఎ.గోవర్ధన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆవిష్కరణలను అన్వేషించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీని దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మారుస్తామని పేర్కొన్నారు. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ఈ టెక్‌ఫెస్ట్ విద్యార్థుల ప్రతిభకు నిలయమని ప్రశంసించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో ప్రొఫెసర్లు మురళీధర్షన్, రణధీర్ సాగి, విట్టల్, మహేశ్, చంద్రశేఖర్, అజయ్, రాములు, స్వప్నిల్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
యాక్టివిటీ సెంటర్ ప్రారంభం..
బాసర ట్రిపుల్ ఐటీలో యాక్టివిటీ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం, ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ ప్రారంభించారు. విద్యార్థుల సంక్షేమం, పాఠ్యేతర కార్యకలాపాలను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలలో ఈ యాక్టివిటీ సెంటర్ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి కేంద్రీకృత చొరవల ప్రాముఖ్యతను వివరిస్తూ సమగ్ర విద్య అనుభవాన్ని అందించడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ స్టూడెంట్ యాక్టివి టీ సెంటర్ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చే శామని ఇన్‌చార్జి వీసీ తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ అభివృద్ధి, సమాజ సేవను ప్రోత్సహించడం లక్ష్యమని పేర్కొన్నారు.