లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావు మామడ, లక్ష్మణచాంద మండలాల పరిధిలోని బోరిగాం గ్రామంలోని గోదాములను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గోదాం నిల్వ సామర్థ్యం, వేబ్రిడ్జి సామర్థ్యం, రికార్డుల పరిశీలన చేసి మేనేజర్ శివరామకృష్ణకు పలు సూచనలు చేశారు. బీహార్ హమాలీలతో మాట్లాడి వారికి కల్పించిన మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి గోదాంలో మొక్క నాటారు. గోడౌన్‌లో బాగా కష్టపడే వారిని గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. పర్యటనకు ముందు నిజామాబాద్ రీజియన్ పరిధిలోని మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎండీ కోర్రా లక్ష్మి, జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎస్.సి శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, ఆర్‌ఎం రాజ్యలక్ష్మి, గోడౌన్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.