● నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ● విద్యార్థులు 9,198 ● 49 పరీక్ష కేంద్రాలు ● సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు 7032463114, 9440688034
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల భవిష్యత్‌కు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 4వరకు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్షల్లో 24పేజీలతో కూడిన జవాబు పత్రం(ఆన్సర్ షీట్) ఇవ్వనున్నారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. సౌకర్యాలపై సూచనలు చేశారు. గురువారం పాఠశాలల్లో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాలను స్టోరేజీ పాయింట్ల నుంచి తరలించాలని ఇదివరకే ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 9,198మంది పరీక్షలకు హాజరు కా నున్నారు. జీఏహెచ్‌ఎస్ 14 పాఠశాల నుంచి 382 మంది, బీసీడబ్ల్యూఆర్‌ఈఐ 7పాఠశాలల్లో 439మంది, ఏడు ప్రభుత్వ పాఠశాలల నుంచి 208మంది, 18 కేజీబీవీల్లో 642మంది, 101 స్థానిక సంస్థల పా ఠశాలల నుంచి 2,815మంది, 80 ప్రైవేటు పాఠశాలలకు చెందిన 3,346మంది పరీక్ష రాయనున్నారు. ఐదు టీఎస్‌ఎంఎస్‌ల నుంచి 445మంది, టీఎస్‌ఆర్‌ఎస్‌కు చెందిన 68మంది, 9టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు చెందిన 672మంది, రెండు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 46మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తంగా 4,730 మంది బాలురు, 4,468మంది బాలికలు, ఒక్కసారి పరీక్ష తప్పిన విద్యార్థులు 221 మంది ఉన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారులు, సిట్టింగ్‌స్క్వాడ్‌లను 49మంది చొప్పున, 484మంది ఇన్విజిలేటర్లను, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.
ప్రశాంతంగా రాయండి
పరీక్షలను ప్రశాంతం రాయాలి. ఆత్మవిశ్వాసం, ధైర్యంగా పరీక్షలు రాయండి. సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతోనూ పరీక్షలకు హాజరుకావచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షల కోసం హెల్‌లైన్ ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలు, సమాచారం కోసం సంప్రదించవచ్చు.
– యాదయ్య, డీఈవో