● అక్కడ దాడులు.. ఇక్కడ అప్రమత్తం ● జిల్లాలోనూ నిఘా పెంచాలంటున్న వాహనదారులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలు, చెక్‌పోస్టులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులతో జిల్లా రవాణా శాఖ(ఆర్టీఏ) అప్రమత్తమైంది. మంగళవారం ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్ జిల్లా భోరజ్ చెక్‌పోస్టులోనూ తనిఖీలు జరిగాయి. జిల్లాలోనూ అధికారులు తనిఖీ చేస్తారనే ప్రచారం జరిగింది. మొదట ఉమ్మడి జిల్లాలో తనిఖీల్లో భాగంగా ఇక్కడ సైతం దాడులు నిర్వహిస్తారని భావించారు. ఏసీబీ అధికారులు జిల్లా వైపు రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కార్యాలయ సిబ్బందితోపాటు అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. ఏజెంట్లు, మధ్యవర్తులతో జరిపే రోజువారీ లావాదేవీలపై జాగ్రత్త వహించారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ప్రైవేటు సిబ్బంది, డ్రైవర్లు, కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు అలర్ట్‌గా ఉన్నారు.
వ్యవస్థీకృతంగా వసూళ్లు
రవాణా శాఖ కార్యాలయంలో ఏళ్లుగా వ్యవస్థీకృతంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా బయటకు రాకుండా వ్యవహారం నడిపిస్తున్నారు. అప్పట్లో ఒకరిద్దరు అధికారులు చిక్కినా ఎక్కువ మంది తప్పించుకుంటున్నారు. రవాణా శాఖలో 17రకాల సేవలను వాహనదారులు నేరుగా పొందవచ్చు. కానీ మధ్యవర్తుల ప్రమేయంతో సర్కారుకు చెల్లించాల్సిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏజెంట్ల వ్యవస్థను అరికట్టాలని ఆన్‌లైన్‌లోనే సేవలు అందుబాటలోకి తెచ్చింది. నేరుగా వెళ్లిన వాహనదారులను అక్కడి సిబ్బంది పలు రకాలుగా ఇబ్బంది పెట్టి చివరకు ఏజెంట్లతోనే వచ్చేలా చేస్తున్నారు. దీంతో జిల్లా రవాణా శాఖలో అవినీతి వ్యవస్థీకృతంగా మారింది. ఇక జిల్లా పరిధిలో లారీ, గూడ్స్ వాహనాల అసోసియేషన్లు, సింగరేణి, వాహన కాంట్రాక్టర్ల నుంచి అనధికారికంగా వసూళ్లుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, బొగ్గు, మట్టి, సిమెంట్, కర్ర, ప్యాసింజర్ ట్రావెల్స్, రవాణా చేసే తదితర భారీ వాహనాల ఫిట్‌నెస్‌ల కోసం ఏటా రూ.లక్షలు వసూలు చేస్తున్నా ఎక్కడా బయటకు రావడం లేదు. చాలామంది అనధికార వసూళ్లపై చూసీ చూడనట్లు ఉంటూ ఫిర్యాదులు ఇవ్వకపోవడం లేదు. ఈ వసూళ్లపై ఏసీబీని ఆశ్రయించకపోవడంతో కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అంతా సజావుగా వ్యవహారం నడుస్తోంది. రాష్ట్రంలో ఆర్టీఏ ఆఫీసుల్లో దాడులు చేస్తున్న క్రమంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయంపైనా నిఘా ఉంచాలని వాహనదారులు కోరుతున్నారు.