భూగర్భ గనులను కాపాడాలి

- - Sakshi

ప్రజాభిప్రాయ సేకరణలో వక్తలు

జీవిత కాలం పెంచే చర్యలు చేపట్టాలి

నిధులను సింగరేణి ప్రాంతంలోనే ఖర్చు చేయాలి

మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఆర్కే న్యూటెక్‌ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్‌లోని సీఈఆర్‌ క్లబ్‌లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, నిజామాబాద్‌ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ జి.లక్ష్మణ్‌ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులు, శ్రీరాంపూర్‌ డీఎంఎఫ్‌టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు.

శ్రీరాంపూర్‌ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్‌ నుంచి కే.సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్‌రావు, బీఎంఎస్‌ నాయకులు పేరం రమేశ్‌, హెచ్‌ఎమ్మెస్‌ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్‌ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్‌మెంట్‌ జీఎం జేవీఎల్‌ గణపతి, ఏరియా ఎస్‌ఓటు జీఎం రఘుకుమార్‌, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్‌, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్‌) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్‌మెంట్‌ హనుమాన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

అభ్యంతరాలు పరిష్కరిస్తాం..
సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది.      –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్‌

ప్రభుత్వానికి నివేదిస్తాం
ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్‌ మోతీలాల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top