మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో ప్రజల వ్యాయామానికి రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు మూతపడే స్థితికి చేరాయి. కొన్నిచోట్ల పరికరాలు చోరీకి గురి కాగా.. మరికొన్నింటిని ఆకతాయిలు విరగ్గొట్టడంతో నిరుపయోగంగా మారాయి. ప్రజలు ఆహ్లాదంగా, ప్రశాంతమైన వాతావరణంలో వ్యాయామం చేసుకునేలా ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయగా.. నిర్వహణ, పర్యవేక్షణ ను కార్పొరేషన్ అధికారులు విస్మరించారు. పరికరా ల రక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రతీ చోట గుర్తు తెలియని వ్యక్తులు పరికరాలు దొంగిలిస్తున్నారు. ఫలితంగా పరికరాల ధ్వంసమై వాడలేని పరిస్థితి ఎదురవుతోంది. ఆయా పరికరాలు మరమ్మతు చేయడం, కొత్తవాటి ఏర్పాటుకు కార్పొరేషన్ నుంచి నిధులు వెచ్చించాల్సి వస్తోంది. చోరీకి గురైన పరికరాల స్థానంలో తిరిగి అమర్చేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. దీంతో ప్రజలు వ్యాయామం చేయడానికి ఇబ్బంది ఎదురవుతోంది. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేలల్లో వ్యాయామానికి వెళ్తున్న నగర ప్రజలు మరమ్మతుకు గురైన వాటిని చూసి వెనుదిరుగుతున్నారు.
నగరంలో పది చోట్ల
మంచిర్యాల నగరంలో పది చోట్ల ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రూ.10లక్షల నుంచి రూ.14లక్షల వరకు వెచ్చించారు. హైటెక్‌సిటీ కాలనీ పార్కు, పాతమంచిర్యాల పార్కు, రెడ్డి కాలనీలోని చిల్డ్రన్స్ పార్కు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మైదానంలో ఓపెన్ జిమ్‌లో పరికరాలు తరచూ చోరీకి గురవుతున్నాయి. కనీస రక్షణ కల్పించకపోవడమే పరికరాల చోరీకి కారణంగా తెలుస్తోంది. కొన్ని పరికరాలు పాడవుతున్నాయి. హైటెక్‌సిటీలోని ఓపెన్‌జిమ్ పార్కు లోపల, చుట్టూ ప్రహరీ, ఇళ్లు, గేటు ఉండడం వల్ల ఇక్కడి పరికరాలు చోరీకి గురి కావడం లేదు. కానీ పరికరాలను ఆకతాయిలు విరగ్గొడుతున్నారు. రాముని చెరువు చిల్డ్రన్స్ పార్కు వద్ద ఓపెన్ జిమ్‌లో పరికరాలు నిత్యం దొంగిలిస్తున్నారు. దీంతో అక్కడ సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అయినా చోరీకి గురవుతూనే ఉన్నాయి. పోచమ్మ చెరువు కట్టపై ఓపెన్ జిమ్ పరికరాలూ దొంగిలిస్తున్నారు. చెరువు కట్టపై సరైన భద్రత లేకపోవడంతోనే చోరీలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలోని ఓపెన్ జిమ్ పరికరాలకు రక్షణ ఉండగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, గర్మిళ్ల పార్కు, రెడ్డి కాలనీ పార్కు, రాంనగర్ పార్కుల్లో ఓపెన్ జిమ్‌లకు ఎలాంటి రక్షణ లే క పరికరాలు చోరీ అవుతున్నాయి. పరిరక్షణకు చర్య లు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.


