నిమిషం ‘టెన్‌’షన్‌ లేదు..! | - | Sakshi
Sakshi News home page

నిమిషం ‘టెన్‌’షన్‌ లేదు..!

Mar 6 2026 8:27 AM | Updated on Mar 6 2026 8:27 AM

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు సడలింపు

శతశాతం ఫలితాలపై ప్రత్యేక దృష్టి

విరామ సమయంలోనూ ప్రత్యేక తరగతులు

ఈ ఏడాది నుంచి వాట్సాప్‌లోనూ హాల్‌టికెట్లు

జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.యాదయ్య

మంచిర్యాలఅర్బన్‌: ‘పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధనను సడలించారు. ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాం. ఈ నెల 14నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సమీపించే కొద్దీ విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడినప్పుడే సులువుగా ఫలితా లు సాధించవచ్చు. మిగిలిన సమయాన్ని సద్వినియో గం చేసుకుంటూ మానసిక ప్రశాంతత, ప్రణాళిక ప్రకారం సాధన చేయడం, ఆహార పు అలవాట్లు, ఆ రోగ్యంగా పరీక్షలకు సన్నద్ధమైతే లక్ష్యాన్ని ఛేదించవచ్చు. ఈ ఏడాది ప్రింటెడ్‌ హాల్‌టికెట్లు, వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌కు వెసులుబా టు కల్పించడంతోపాటు ఈ ఏడాది నుంచి వాట్సాప్‌లోనూ పొందడానికి అవకాశం కల్పించారు..’ అని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎస్‌.యాదయ్య అన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో మెరుగైన ఫలితాలకు కార్యాచరణ, నిర్వహణ తీరు, కేంద్రాల్లో సౌకర్యాలపై ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

మెరుగైన ఫలితాలకు తీసుకుంటున్న చర్యలు

డీఈవో: పదో తరగతి వార్షిక పరీక్షల్లో శతశాతం ఫలితాల సాధనకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఉదయం, సాయంత్రం వేళల్లో గంటపాటు ప్రత్యేక నిర్వహణ సాగుతోంది. స్లిప్‌టెస్టులు, ప్రీఫైనల్‌, ప్రాక్టీస్‌ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి సీబీఎస్‌ఈ తరహాలో ఒక్కో పేపర్‌కు మధ్య విరామ రోజుల సంఖ్య పెంచారు. విరామ సమయంలో ప్రత్యేక కార్యాచరణ పక్కాగా అమలుకు ఆదేశాలు ఇచ్చాం.

పరీక్షల నిర్వహణ, కేంద్రాల్లో సౌకర్యాలు..

డీఈవో: కేంద్రాల వద్ద మౌలిక వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించాం. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తాగునీరు, వైద్య సిబ్బందితోపాటు మందులు అందుబాటులో ఉంటాయి. ఫర్నిచర్‌, డ్యుయల్‌ డెస్క్‌లు, ఫ్యాన్లతోపాటు సౌకర్యాలు కల్పించాం. నిరంతర విద్యుత్‌ సరఫరాకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రతీ సెంటర్‌లో సీఎస్‌ గదిలో సీసీ కెమెరాలు అమర్చుతాం.

హాజరయ్యే విద్యార్థుల సంఖ్య

డీఈవో: జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 9,703 మంది పరీక్ష రాయనున్నారు. వీరిలో బాలురు 4,896 మంది, బా లికలు 4,807 మంది ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం 8884, తెలుగు మీడియం 772, ఉర్దూలో 47 మంది రాయనున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు 48, డిపార్టుమెంటల్‌ అధికారులు 58, సెంటర్‌ కస్టోడియన్స్‌ 4, ఇన్విజిలేటర్లు 460మందిని నియమించాం. సౌకర్యాలు ఉన్న పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశాం.

చూచిరాత, అక్రమాల నిరోధానికి ఎలాంటి

చర్యలు తీసుకుంటారు

డీఈవో: ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. నిఘా కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలు తెరవడం, జవాబు పత్రాలు సీల్‌వేయడం జరుగుతుంది. ప్రతీ సెంటర్‌లో సిట్టింగ్‌ స్క్వాడ్‌, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు బృందంతోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కేంద్రాలను నిరంతరం గమనిస్తుంటారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లకూడదు.

హాల్‌టికెట్ల పంపిణీపై..

డీఈవో: హాల్‌టికెట్ల కోసం పాఠశాలల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హాల్‌టికెట్లు విడుదల కాగా.. మూడు రకాలుగా అందుబాటులో ఉంటాయి. ప్రింటెడ్‌ హాల్‌టికెట్లు పాఠశాలల్లో పంపిణీ చేస్తారు. ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌ bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉంచారు. 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా hi సందేశం పంపాలి. ఆ తర్వాత ssc hall ticket march 2026 అని పంపాలి. విద్యార్థి వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్‌ పొందవచ్చు. సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తారు.

విద్యార్థులకు సూచనలు, సలహలు

డీఈవో: జీవితంలో సర్వం పరీక్షలే అని భావించొద్దు. ప్రణాళిక ప్రకారం చదువుకోవడం, మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. పరీక్ష అనే భయం వీడండి, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రాయండి. తల్లిదండ్రులు పిల్లలను టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. పరీక్షలకు ఐదు నిమిషాల సడలింపు ఇచ్చారు. పరీక్షకు ఒక రోజు ముందుగానే వెళ్లి కేంద్రాన్ని పరిశీలించుకోవడం మంచిది. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గడియారాలు అనుమతించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement