మంచిర్యాలఅర్బన్: సర్కారు బడుల్లో కొత్తగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతుల ఇన్‌స్ట్రక్టర్లు(బోధకులు), ఆయా(సహాయకులు)లకు వేతనాలు మంజూరయ్యాయి. జిల్లాలో రెండు దఫాలుగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలల్లో మూడు పీఎంశ్రీ పాఠశాలలు మినహయిస్తే 31 పాఠశాలలకు ఏడు నెలలు, 10 పాఠశాలలకు 10 నెలల వేతనాలు చెల్లించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య కొనసాగుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 480 ప్రాథమిక, 96 ప్రాథమికోన్నత, 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 38,298 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటుతో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. పీపీ–1లో 5704, పీపీ–2లో 4727, పీపీ–3లో 3265 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తం 44 పాఠశాలలో 44 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 44 మంది ఆయాలను నియమించారు. బోధకులకు రూ.8వేలు, ఆయాకు రూ.6 వేల చొప్పున అందించాల్సి ఉంది. మూడు పీఎంశ్రీ పాఠశాలలకు మినహయిస్తే మిగతా 41 పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాల కోసం ఎదురు చూడకతప్పలేదు. 26 పాఠశాలలకు గత అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఏడు నెలల వేతనాలు రూ.25,48,000 మంజూరయ్యాయి. మరో ఉత్తర్వుల్లో పది పాఠశాలలకు పది నెలల గౌరవ వేతనాలు రూ.14,00,000, ఐదు ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఏడు నెలల నిధులు రూ.4,90,000 మంజూరయ్యాయి. ఇప్పటికే పలు పాఠశాలల ఖాతాల్లో జమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో సాంకేతిక కారణా వల్ల ఆలస్యం కావడంతో ఒకటి రెండు రోజుల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు.


