
రహదారి నమూనా చిత్రం
సాక్షి, లక్సెట్టిపేట: జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో ఆయా శాఖల అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ రహదారుల విస్తరణకు మోక్షం లభించింది. పలు జిల్లాలను కలుపుతూ సర్వే నిర్వహించి మ్యాప్‌లను గూగుల్‌లో అప్‌లోడ్ చేశారు. స్థలసేకరణలో వ్యవసాయ భూములు, భవనాలు చాలా వరకు నష్టపోయే ప్రమాదముందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఎంత నష్టపరిహారం చెల్లిస్తారోనని ఆవేదన చెందుతున్నారు. భవిష్యత్ రోడ్డు రవాణా దృష్ట్యా జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా కేంద్రం పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రహదారుల విస్తరణ ప్రారంభం..
63వ జాతీయ రహదారుల విస్తరణలో గ్రీన్ హైవే పేరుతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మోర్తాడ్, కమ్మరిపల్లి, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం, లక్సెట్టిపేట మీదుగా మంచిర్యాల వరకు నాలుగు వరుసల రోడ్డును విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 130 కిలోమీటర్ల దూరం హైవే రోడ్డు నిర్మాణం పనులను త్వరలోనే చేపట్టనుంది. పట్టణం మధ్య నుంచి జాతీయ రహదారి వెళ్తుంటే చాలా భవనాలు తొలగిపోనున్నాయి. జిల్లాలో దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో రోడ్డు వెడల్పుతో చాలా వరకు ఖరీదైన భవనాలు ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రహదారిని మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల బైపాస్ మీదుగా కాగజ్‌నగర్ రూట్‌లోని క్యాతనపల్లిలోని నేషనల్ హైవే 363కి అనుసంధానం చేయనున్నారు. ఈ రహదారిని నాలుగు భాగాలు విభజించి టెండర్లు వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి పనుల నిమిత్తం సర్వే చేపట్టింది. ఇంకా పనులు ప్రారంభించలేదు. దూరం తగ్గించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఫోర్ లైన్ రోడ్డును నిర్మాణం చేస్తుంది. మంచిర్యాలలోని హైవే లైన్‌కు కలుపుతారు. ఇంకా పూర్తిస్థాయిలో పనులు చేపట్టనున్నారు.
– రవీందర్, జాతీయ రహదారుల అధికారి, మంచిర్యాల