గురుకులం నుంచి విద్యార్థినుల పరార్‌ | - | Sakshi
Sakshi News home page

గురుకులం నుంచి విద్యార్థినుల పరార్‌

Nov 28 2026 12:50 AM | Updated on Nov 28 2026 12:50 AM

జడ్చర్ల టౌన్‌: తోటి విద్యార్థినులు హేళన చేస్తున్నారంటూ మనస్తాపానికి గురైన ఇద్దరు బాలికలు గురుకుల పాఠశాల నుంచి పారిపోయిన ఘటన జడ్చర్లలో కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రహరీ దూకి బయటకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థినులు.. సుమారు మూడు గంటల తర్వాత పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలో కనిపించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీ గుర్తించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని తిరిగి గురుకులానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో పాఠశాలలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తమవుతోంది. గంగాపురం రోడ్డులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సుమారు ఏడు అడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లారు. ఉదయం 5 గంటలకు నైట్‌ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయురాలు అనిత రోల్‌కాల్‌ నిర్వహించి హాజరు తీసుకున్నారు. అనంతరం ఉదయం 8.15 గంటలకు ప్రార్థన సమయంలో మరోసారి హాజరు పరిశీలించగా ఇద్దరు విద్యార్థినులు కనిపించలేదు. దీంతో ప్రిన్సిపాల్‌ శ్యామల 8.30 గంటల సమయంలో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా విద్యార్థినులు 167వ జాతీయ రహదారి మీదుగా నేతాజీ చౌరస్తా వైపు వెళ్లినట్లు గుర్తించారు. అప్పటికే గురుకులానికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు గాలింపు చేపట్టారు. చివరకు ఆర్‌కే ధమాక సమీపంలోని ఓ దుకాణం వద్ద వారిని గుర్తించి గురుకులానికి తీసుకొచ్చారు. ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించగా.. తోటి విద్యార్థినులు హేళన చేయడంతో మనస్తాపానికి గురయ్యామని, గురువారం రాత్రి కూడా ఏడుస్తూ ఉన్నామని చెప్పినట్లు తెలిసింది.

భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు

ఏడడుగుల ఎత్తున్న ప్రహరీ దూకి ఇద్దరు విద్యార్థినులు బయటకు వెళ్లడం పాఠశాల భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నైట్‌ డ్యూటీలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సిబ్బంది స్థానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళ వాచ్‌మెన్‌ పర్యవేక్షణపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులు కనిపించకపోయిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ శ్యామల, క్లాస్‌ టీచర్‌ లావణ్యను వివరణ కోరగా.. విద్యార్థినులు తమకు ఎలాంటి సమస్యలు చెప్పలేదని తెలిపారు. ఘటన నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితీరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అమర్‌నాథ్‌గౌడ్‌ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలో గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయించి విద్యార్థినుల్లో అసమానతలు తొలగించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.

తోటి విద్యార్థినులు హేళన చేయడంతో మనస్తాపం

ప్రహరీ దూకి తెల్లవారుజామున బయటకు..

సీసీ కెమెరాల ఆధారంగా చౌరస్తా వద్ద గుర్తింపు

మూడు గంటల తర్వాత గురుకులానికి చేరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement