మదనాపుర: కొండకోనల్లో గోవింద నామస్మరణ.. భక్తజన సందోహం మధ్య దేదీప్యమానంగా వెలిగే అఖండ జ్యోతి.. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం.. ఇదీ తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలోని శ్రీకురుమూర్తి స్వామి ఆలయ మహాదీపోత్సవ వైభవం. ఏడు కొండల నడుమ కొలువైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన ఈ వేడుక భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తుతుంది. దాదాపు నాలుగు శతాబ్దాలుగా పద్మశాలీ కుటుంబాలు అత్యంత నిష్టతో కొనసాగిస్తున్న ఈ దీపసేవ ఇక్కడి ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్యోతి
దీపం అంటే కేవలం వెలుగు కాదు.. సాక్షాత్తు దైవస్వరూపమని భక్తుల విశ్వాసం. కురుమూర్తి క్షేత్రంలో కొండపై నిరంతరం వెలిగే అఖండ జ్యోతికి అందుకే అంతటి ప్రాధాన్యం. ఈ దివ్యజ్యోతిని దర్శించుకుంటే పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. సంతాన ప్రాప్తి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. బ్రహ్మోత్సవాల వేళ ఈ దీప దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
పద్మశాలీలదే వంశపారంపర్య సేవ
ఈ మహాదీపోత్సవం వెనుక దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. కురుమూర్తికి చెందిన పద్మశాలీ కుటుంబాలు తరతరాలుగా ఈ పవిత్ర సేవను కొనసాగిస్తున్నాయి. దీనిని కేవలం సంప్రదాయంగా కాకుండా.. స్వామివారు తమ వంశానికి ప్రసాదించిన పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాయి. దీపం కోసం ప్రత్యేకంగా నూలు వస్త్రాలతో ఒత్తులు తయారు చేయడంతోపాటు ఆవునెయ్యిని సిద్ధం చేస్తారు. కుటుంబ సభ్యులు శుచిశుభ్రత, ఉపవాస దీక్ష, సాత్విక ఆహారం వంటి నియమాలను పాటిస్తూ స్వామివారి నామస్మరణలో గడుపుతారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల నడుమ పద్మశాలీ పెద్దలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మహా ప్రమిదలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఆ సమయంలో మారుమోగే గోవింద నామస్మరణ భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతుంది.
గిరిశిఖరంపై మహాదీపం
ఆలయ ప్రాంగణంలోని ఎత్తైన గిరిశిఖరంపై ఏర్పాటు చేసిన విశాలమైన రాతి ప్రమిదలో మహాదీపాన్ని వెలిగిస్తారు. ఉద్దాల ఉత్సవం, అలంకారోత్సవాల అనంతరం జరిగే ఈ అపురూప ఘట్టం క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య అఖండ జ్యోతి వెలిగిన క్షణం కొండంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. కొండపై నుంచి వెలువడే దివ్యకాంతి దూర ప్రాంతాలకూ కనిపిస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు.
కురుమతి కొండపై మహాదీపోత్సవం.. భక్తజనానికి కనువిందు
అజ్ఞానాంధకారాన్ని తొలగించే దివ్యజ్యోతి
తరతరాలుగా దీపం వెలిగిస్తున్న పద్మశాలీలు
నిష్ట, నియమాలతో కొనసాగుతున్న వంశపారంపర్య సేవ


