జడ్చర్ల టౌన్: మండల సర్వేయర్, లైసెన్స్ సర్వేయర్లు ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకల్లా క్షేత్రస్థాయిలో విధులకు హాజరై ప్రతిరోజు కనీసం 40 ఎకరాల భూమి రీ సర్వే పనులు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. బుధవారం మండలంలోని అంబటాపూర్, కిష్టారం గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను ఆమె తహసీల్దార్ నర్సింగరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజువారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ప్రతి సర్వే బృందానికి నిర్దిష్ట ప్రాంతాలను కేటాయించి సమన్వయంతో పనులు నిర్వహించాలని సూచించారు. రీ సర్వేలో భూములను కచ్చితంగా కొలవడంతోపాటు సర్వే నంబర్లు, సరిహద్దులను సక్రమంగా గుర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న కొలతలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి సర్వే ప్రక్రియపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణలో ఎదురవుతున్న సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకుని శాసీ్త్రయ పద్ధతిలో చేపడుతున్న రీ సర్వే ద్వారా భూముల సరిహద్దులపై స్పష్టత ఏర్పడటంతోపాటు భవిష్యత్‌లో భూ వివాదాలు తగ్గుతాయని చెప్పారు. రీ సర్వే ప్రక్రియ విజయవంతంగా నిర్ణీత గడువులో పూర్తిచేసేందుకు రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, సర్వేయర్ సాయిరాం తదితరులున్నారు.


