సాగుకు యంత్రాలు | - | Sakshi
Sakshi News home page

సాగుకు యంత్రాలు

Nov 19 2026 3:07 AM | Updated on Nov 19 2026 3:07 AM

నాగర్‌కర్నూల్‌: సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ రైతులకు వ్యవసాయ పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్‌ మిషన్స్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద రాష్ట్ర వ్యవసాయ శాఖ 37 రకాల వ్యవసాయ యంత్రాలు, పరికరాలను గుర్తించింది. వీటితో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేసుకునేందుకు అర్హత కలిగిన రైతు ఉత్పత్తిదారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార, మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించింది.

ఉమ్మడి జిల్లాకు రూ.13.17 కోట్లు..

ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలకు కలిపి 69 కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలకు ఆమోదం లభించింది. ఇందులో మహబూబ్‌నగర్‌ 18 కేంద్రాలకు రూ.3.02 కోట్లు, నాగర్‌కర్నూల్‌లో 15 కేంద్రాలకు రూ.2.99 కోట్లు, జోగుళాంబ గద్వాలలో 9 కేంద్రాలకు రూ.1.80 కోట్లు, వనపర్తిలో 7 కేంద్రాలకు రూ.1.40 కోట్లు, నారాయణపేటలో 20 కేంద్రాల కోసం రూ.3.96 కోట్లు కలిపి మొత్తం రూ.13.17 కోట్ల నిధులను కేటాయించారు. ఒక్కో కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం లేదా గరిష్టంగా రూ.20 లక్షలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత సబ్సిడీగా అందిస్తారు. కిసాన్‌ డ్రోన్‌ కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలకు మాత్రం డ్రోన్‌ ప్రాథమిక ధర, అనుబంధ పరికరాల వ్యయంలో 50 శాతం లేదా రూ.5 లక్షలు ఏది తక్కువైతే అంత సహాయం చేస్తారు.

దుక్కులు మొదలుకొని..

ఎస్‌ఎంఏఎం పథకంలో భాగంగా రైతులకు అవసరమైన 37 రకాల యంత్రాలు, పరికరాలను వ్యవసాయ శాఖ జాబితాలో పేర్కొంది. భూమిని దున్నేందుకు పవర్‌ టిల్లర్‌, డిస్క్‌ ప్లౌ, కల్టివేటర్‌, లెవలింగ్‌ బ్లేడ్‌, రొటోవేటర్‌ వంటి పరికరాలు ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు ఒకేసారి వేసే సీడ్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్‌, మల్టీక్రాప్‌ ప్లాంటర్‌, రిడ్జ్‌ ఫరో ప్లాంటర్‌ వంటి యంత్రాలూ ఉన్నాయి. కలుపు నివారణకు పవర్‌ వీడర్‌, గడ్డి కోసే యంత్రాలు, చీడపీడల నివారణకు స్ప్రేయర్లు, ట్రాక్టర్‌కు అమర్చే బూమ్‌ స్ప్రేయర్‌, కిసాన్‌ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. పంట కోతకు కంబైన్డ్‌ హార్వెస్టర్‌, మొక్కజొన్న కోత యంత్రం, మల్టీక్రాప్‌ థ్రెషర్‌, విన్నోయింగ్‌ ఫ్యాన్‌ వంటి పరికరాలతోపాటు పంట అవశేషాల నిర్వహణకు స్ట్రా బేలర్‌, రోటరీ ష్రెడర్‌, మల్చర్‌, బ్రష్‌ కట్టర్‌లను కూడా జాబితాలో చేర్చారు.

సన్న, చిన్న రైతులకు ప్రయోజనం

ఖరీదైన వ్యవసాయ యంత్రాలను ప్రతి రైతు సొంతంగా కొనుగోలు చేయడం ఆర్థికంగా భారమే. అయితే కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ద్వారా అవసరమైన సమయంలో యంత్రాలను అద్దెకు తీసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో సాగు పెట్టుబడి తగ్గడంతోపాటు దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు నివారణ, పంట కోత వంటి పనులను సకాలంలో పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది.

రాయితీపై 37 రకాల వ్యవసాయపరికరాలు అందజేత

ఉమ్మడి జిల్లాలో 69 కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

రైతు ఉత్పత్తిదారులు, పీఏసీఎస్‌లు, మహిళా సంఘాలకు అవకాశం

ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు సాయం

నాలుగు నెలల్లో ఈ పథకాన్ని పూర్తిచేయాలని ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement