జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ భానుప్రకాశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారుల (ఈఆర్‌ఓలు)తో వీసీ నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫారం–18 దరఖాస్తుల స్థితిగతులు, పరిశీలన పురోగతిని వివరించారు. ఓటరు నమోదుకు అందిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి.. నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు కోసం మొత్తం 45,477 దరఖాస్తులు అందాయని, గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి సుమారు 10 వేలు అదనంగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో సుమారు 1,600 దరఖాస్తులు క్షేత్రస్థాయి విచారణ కోసం పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా మరో రెండు రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో ఆర్డీఓ నవీన్, ఎన్నికల డీటీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ బీమా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సీఎస్ సంజయ్‌జాజు కలెక్టర్లను ఆదేశించారు. సీఎస్ హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు అమలవుతున్న బీమా పథకాలు ఇందిరమ్మ కుటుంబ బీమా పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నేతన్నలు, గౌడ్లు, కార్మికులు, మత్స్యకారులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి.. రూ.5 లక్షలకు పెంచనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు నెల రోజులపాటు కొనసాగనున్న నమోదు ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. వీసీలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


