జడ్చర్ల/ దేవరకద్ర/ నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం ధాన్యం పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 18,954 బస్తాల ధాన్యం రావడంతో యార్డు ఆవరణ కిక్కిరిసిపోయింది. కాగా.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.3,969, కనిష్టంగా రూ.2,209 ధరలు లభించాయి. అలాగే 1,067 బస్తాల మొక్కజొన్న రాగా.. గరిష్టంగా రూ.3,182, కనిష్టంగా రూ.2,980, వేరుశనగ 233 బస్తాలు రాగా.. గరిష్టంగా రూ.9,141, కనిష్టంగా రూ.5,525, పత్తి 510 బస్తాలు రాగా.. గరిష్టంగా రూ.9,219, కనిష్టంగా రూ.8,769 చొప్పున పలికాయి.
నేడు మార్కెట్‌కు సెలవు..
బాదేపల్లి యార్డులో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో గురువారం క్రయవిక్రయాలు నిలిపివేసి సెలవు ప్రకటించినట్లు యార్డు కార్యదర్శి అశ్వక్ అహ్మద్ తెలిపారు. ఆవరణలో మూడు రోజులుగా వచ్చిన ధాన్యం ఇతర దిగుబడులను వ్యాపారులు తరలించకపోవడంతో ఎక్కడికక్కడ నిల్వలు నిలిచిపోయాయన్నారు. దాదాపు యార్డులోని షెడ్లు, ఆవరణలో 50 వేల బస్తాలకు పైగా ఉండగా.. హమాలీల కొరత కూడా ఉందన్నారు. వీటిని తరలించడం కోసం గురువారం క్రయవిక్రయాలు నిలిపివేశామని, శుక్రవారం యథావిధిగా అమ్మకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ.3,895, కనిష్టంగా రూ.2,750 ధరలు నమోదయ్యాయి. అలాగే కేఎన్ ఎం గరిష్టంగా రూ.3,216, కనిష్టంగా రూ.2,825గా చొప్పున పలికింది. మార్కెట్‌కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
● నవాబుపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 10,323 బస్తాల వరి, 289 బస్తాల మొక్కజొన్న ధాన్యం వచ్చింది. కాగా.. వరి క్వింటాల్ గరిష్టంగా రూ.4,014, కనిష్టంగా రూ.3,990 ధర వచ్చింది. అలాగే మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.3,156, కనిష్టంగా రూ.3,144 చొప్పున పలికింది. వరి ధ్యానం వారానికి వారం పెరుగుతూ వస్తుండగా.. వచ్చే వారం మరింత పెద్దమొత్తంలో వస్తుందని దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు.


