నేడు అలంకారోత్సవం.. ఏర్పాట్లు పూర్తి
● ఆత్మకూర్ ఎస్‌బీఐ నుంచి ఆభరణాల ఊరేగింపు
● వందమంది పోలీసులతో
పటిష్ట బందోబస్తు
● 16న ఉద్దాల మహోత్సవం..
లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
● మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు
చిన్నచింతకుంట/ఆత్మకూర్: తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన అలంకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు స్వామివారికి అలంకారోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆత్మకూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి విలువైన బంగారు ఆభరణాలను బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మేళతాళాలు, బాణసంచా నడుమ ఊరేగింపుగా అమ్మాపురం మీదుగా కురుమూర్తి క్షేత్రానికి తరలించనున్నారు. ఈ నెల 16న ఉద్దాల మహోత్సవం జరగనుండటంతో వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
రాజవంశీయులు సమర్పించిన ఆభరణాలు
ముక్కెర రాజవంశీయులు స్వామివారికి సమర్పించిన కిరీటం, భుజకీర్తులు, శంఖుచక్రాలు, మకర కుండాలు, హస్తాలు, నామం, ముత్యాల హారాలు, పచ్చలు పొదిగిన హారాలు తదితర ఆభరణాలను బ్యాంకు లాకర్ నుంచి తీసుకువస్తారు. తరతరాల ఆనవాయితీ ప్రకారం గాడి వంశస్తులు వీటిని తల పై ధరించి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈసారి ఆత్మకూర్‌కు చెందిన గాడి లక్ష్మినారాయణచారి ఈ బా ధ్యతను నిర్వహించనున్నారు. ఆత్మకూర్ చెరువుకట్ట వద్ద ప్రత్యేక పూజల అనంతరం కొత్తపల్లి, దు ప్పల్లి మీదుగా అమ్మాపురంలోని రాజవంశీయుల నివాసానికి చేరుకుంటాయి. అక్కడ రాజ శ్రీరాంభూపాల్ ఇంట్లో గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నంబి వంశస్తులు ఆభరణాలను తలపై ధరించి కాలినడకన కురుమూర్తి కొండలకు తీసుకెళ్తారు. ఆలయంలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో పూజారులకు అందజేసిన అనంతరం స్వామివారికి అలంకరిస్తారు. దీంతో కాంచనగుహ స్వర్ణకాంతులతో వెలిగిపోనుంది.
1265 నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ
కురుమూర్తి క్షేత్రానికి ప్రాచీన చరిత్ర ఉంది. క్రీ.శ.1265లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. అప్పట్లో కురుమూర్తి కొండలు దట్టమైన అడవిలో ఉండటంతో దొంగల బెడద, క్రూరమృగాల భయం ఉండేది. దీంతో స్వామివారి ఆభరణాలను ఉత్సవాల సమయంలో మాత్రమే అలంకరించి, మిగతా రోజుల్లో అమ్మాపురంలోని ముక్కెర రాజవంశీయుల కోటలో భద్రపరిచేవారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఏనుగులపై ఆభరణాలను ఆలయానికి తీసుకెళ్లేవారు. కాలక్రమంలో ప్రభుత్వ బ్యాంకులు అందుబాటులోకి రావడంతో ఉత్సవాల అనంతరం ఆభరణాలను ఎస్‌బీఐ లాకర్‌లో భద్రపరుస్తున్నారు. అయినప్పటికీ ఆభరణాల ఊరేగింపు, పూజల సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.


