పాలమూరు పల్లెల్లో ఒకప్పుడు రాత్రంతా సాగిన ఒగ్గు కథలు, పౌరాణిక, సాంఘిక నాటకాల్లో కురుమూర్తి స్వామి మహత్యం ప్రధాన ఇతివృత్తంగా ఉండేది. స్వామివారి లీలలు, క్షేత్ర చరిత్రను కథలుగా మలిచి కళాకారులు ప్రజలకు వినిపించేవారు. కోలాటాలు, చెక్క భజనలు, జడకుచ్చుల ఆటలు, బుడ్డెమ్మ పాటలు ఇలా ఒక్కో జానపద కళారూపంలోనూ స్వామివారి కీర్తనలకు ప్రత్యేక స్థానం లభించింది. చదువుతో సంబంధం లేకుండా పల్లె కళాకారులు తమ అనుభవం, ప్రతిభతో పాటలు కట్టి, రాగాలు అల్లి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించారు. వినోదంతోపాటు ఆధ్యాత్మికతను, సామాజిక సందేశాలను అందించడంలో ఈ కళారూపాలు కీలకపాత్ర పోషించాయి.
కళాకారులకు క్షేత్రం కొండంత అండ..
కురుమూర్తి జాతర ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాలేదు. జానపద కవులు, గేయ రచయితలు, కళాకారులు, నాటక రంగ ప్రముఖులను ప్రోత్సహించే వేదికగానూ నిలిచింది. స్థానికంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. సంస్థానాధీశుడు ఇమ్మడి తిమ్మారెడ్డి కాలం నుంచి శ్రీరాం భూపాల్ వరకు రాజవంశీకులు కవులు, కళాకారులను సన్మానిస్తూ వచ్చారు. జాతర సందర్భంగా కళాకారులకు గుర్తింపు, ప్రోత్సాహం లభించడంతో గ్రామీణ కళారూపాలకు ఆదరణ పెరిగింది. కవుల కలాలకు, గాయకుల గొంతులకు, కళాకారుల ప్రదర్శనలకు ఈ క్షేత్రం స్ఫూర్తినిచ్చింది. అందుకే కురుమూర్తి జాతర పాలమూరు జానపద సాహిత్యానికి, మట్టి కళలకు ఓ ప్రత్యేక వేదికగా గుర్తింపు పొందింది.
ఒగ్గు కథల నుంచి కోలాటాల వరకు..
ఆరు శతాబ్దాలుగా గ్రామీణ కళారూపాలకు ఆధ్యాత్మిక ఆలంబన
తోలుబొమ్మలాట నుంచి సోషల్ మీడియా రీల్స్ వరకు.. స్వామివారి కీర్తనల హోరు
కోలాటాలు, ఒగ్గు కథలు, జానపద గేయాలకు క్షేత్రమే ప్రేరణ..
కళాకారులకు అండగా కురుమూర్తి జాతర


