● గోవిందనామస్మరణతో మారుమోగిన కొండలు
● వైభవంగా కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిన్నచింతకుంట: తెలంగాణ ప్రజలు ఇలవేల్పుగా కొలిచే శ్రీ అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది ప్రధాన ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం వేదపండితులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు ఆవాహిత దేవతా పూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వానం, బలిపూజతో పాటు 108 అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. అనంతరం కురుమూర్తి స్వామివారు, పద్మావతి, అలివేలుమంగమ్మ అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను నూతన పట్టు వస్త్రాలు, బంతి, మల్లెపూలతో విశేషంగా అలంకరించి కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. గోవింద నామస్మరణతో కురుమూర్తి కొండలు మారుమోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, చైర్మన్ బత్తుల బాల్‌రాజు, అర్చకులు వెంకటయ్య, సత్యం, నర్సింహులు, కమిటీ సభ్యులు మైపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, అర్జున్, భరత్‌రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


