150 అడుగుల దుందువాతో అంబరాన్నంటిన సంబురం | - | Sakshi
Sakshi News home page

150 అడుగుల దుందువాతో అంబరాన్నంటిన సంబురం

Nov 11 2026 1:25 AM | Updated on Nov 11 2026 1:25 AM

జడ్చర్ల టౌన్‌: మండలంలోని గంగాపురం గ్రామంలో మంగళవారం రాత్రి దుందువా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ‘దివ్వి దివ్వి దీపావళి’ పాటలు, గోవింద నామస్మరణలతో గ్రామ వీధులు మారుమోగాయి. ఈసారి ఏకంగా 150 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో భారీ దుందువాను తయారు చేసి వేడుకలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్ష్మీ చెన్నకేశవస్వామి కొలువైన గంగాపురంలో ప్రతి ఏటా కార్తీక మాసం పాడ్యమి రాత్రి దుందువా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన హరిజనులు మంగళవారం తెల్లవారుజామునే పొలాల నుంచి వావిలి, కంది, జీనుగ, గోగునార కట్టెలను సేకరించారు. వరితాళ్లతో దుందువాను తయారు చేసేందుకు దాదాపు 50 మంది రాత్రి వరకు శ్రమించారు. దుందువా సిద్ధమైన అనంతరం ముందుగా పూజలు నిర్వహించి గ్రామస్థులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆపై మేళతాళాల నడుమ దానిని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం ఎదుటకు తీసుకెళ్లారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ‘జై చెన్నకేశవ’ నామస్మరణల మధ్య దుందువాకు ఒకవైపు నిప్పంటించారు. అనంతరం భారీ తాళ్లతో దానిని గ్రామ వీధుల్లోకి లాగుతూ ‘దివ్వి దివ్వి దీపావళి’ అంటూ గ్రామస్థులు ఉత్సాహంగా వెంట నడిచారు. పిల్లలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను సందడిగా మార్చారు. దుందువా నుంచి విడిపోయే కర్రలను సేకరించేందుకు చిన్నారులు, యువకులు పోటీపడ్డారు.

వ్యాధులు దరిచేరవన్న నమ్మకం..

దీపావళి తర్వాత శీతాకాలం ప్రారంభమవుతుందని, ఈ సమయంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకే వివిధ రకాల కట్టెలతో దుందువాను తయారు చేసి గ్రామంలో తిప్పుతామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైందో కచ్చితంగా తెలియదని, తరతరాలుగా వస్తున్న సంప్రదాయంగా నిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. దుందువా వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement