● ముందువెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు
● ఏపీలోని చిత్తూరు జిల్లా వాసి దుర్మరణం, మరో ముగ్గురికి గాయాలు
జడ్చర్ల: ముందు వెళ్తున్న లారీ ఆకస్మికంగా బ్రేకులు వేసి రోడ్డుపై నిలపడంతో ఆ వెనుకే వస్తున్న ఓ కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితి నుంచి గాయాలతో బయటపడ్డారు. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం మేరకు.. ఏపీలోని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సేవాయికాల్వకు చెందిన కిల్జీ ప్రసాద్(39) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను దీపావళి పండుగకు సొంతూరుకు వెళ్లి సోమవారం కారులో తనతో పాటు మరో ముగ్గురు దీప్‌సాయి, వినోద్‌కుమార్, వినీతతో కలిసి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత జడ్చర్ల శివారులో త్రీ స్టార్ హోటల్ వద్ద ముందు వెళ్తున్న లారీ ఆకస్మికంగా ఆపడంతో వెనుకే వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న కిల్జి ప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే వైద్య చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో కిల్జి ప్రసాద్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మార్గమధ్యలో మృతిచెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. కోమాలోకి వెళ్లిన దీప్‌సాయి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా ఛిద్రమైంది. మృతుడి సోదరుడు మహేందర్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ ముల్లా మహబూబ్ పీరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


