కొడంగల్: కొడంగల్‌కు ఒక రోజు ముందే దీపావళి పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం దుద్యాల మండలం హకీంపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శన– 2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులు.. శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలే నాకు ఆత్మ బంధువులు.. వారే నా బలం అని పేర్కొన్నారు. వారిని మించిన ఆత్మీయులు నాకెవరూ లేరన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కొడంగల్‌కు తగిన ప్రాధాన్యత లభించలేదన్నారు. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలే తెలంగాణ పాలకులన్నారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. కొడంగల్‌కు మంచి రోజులొచ్చాయి, ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో నాకు ముఖ్యమంత్రిని అయ్యే అదృష్టం దక్కింది, రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం వచ్చిందని స్పష్టంచేశారు.
పెద్ద చదువులకు ఇక్కడికే రావాలి
పెద్ద చదువులు చదవాలంటే రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు కొడంగల్‌కు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కొడంగల్‌కు ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్ కాలేజీ మంజూరు చేశాం. రూ.5 వేల కోట్లతో ఎడ్యుకేషన్ హబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, క్రీడా ప్రాంగణం, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, స్కిల్ యూనివర్శిటీ, ఏటీసీ, అగ్రికల్చర్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను మంజూరు చేశాం. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులకు ప్రస్తుతం కొడంగల్‌లోనే అన్ని వసతులతో విద్యా ప్రాంగాణాన్ని ఏర్పాటు చేశాం అని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ్మ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, సీఎమ్ఓ కార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్ర తదితరులు పాల్గొన్నారు.
మీరే నా ఆత్మ బంధువులు.. నా బలం
ఈ ప్రాంతానికిమంచి రోజులు వచ్చాయి
గత పాలకులనిర్లక్ష్యంతోనే వెనకబాటు
మీ ఆశీర్వాదంతో సీఎంనయ్యా
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించా
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి


