మహబూబ్‌నగర్ క్రీడలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం ఎస్జీఎఫ్ అండర్–19 విభాగం ఉమ్మడి జిల్లా బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపికల కన్వీనర్ ఆనంద్‌కుమార్, కోకన్వీనర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్జీఎఫ్ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, పీడీలు రాజు, ఉమాదేవి, సుగుణ, నాగమణి, ముస్తఫా, రామకృష్ణ, రాకేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్‌లో బ్యాడ్మింటన్ ఎంపికలు
జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో అండర్–19 ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. రానున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీల్లో పాలమూరుకు రెండోస్థానం
మహబూబ్‌నగర్ క్రీడలు: పెద్దపల్లిలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–17 బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు ప్రతిభచాటింది. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు రెండోస్థానంలో నిలిచింది. ద్వితీయస్థానంలో నిలవడంపై ఉమ్మడి జిల్లా బాలికల జట్టును జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అభినందించారు.


