ధాన్యం సేకరణకు పక్కాగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు పక్కాగా ఏర్పాట్లు

Nov 7 2026 12:54 AM | Updated on Nov 7 2026 12:54 AM

అక్రమాలపై ఉక్కుపాదం

ఎల్‌–3 గ్రేడింగ్‌ ఉంటేనే కొనుగోళ్లు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఖరీఫ్‌ 2026–27 ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సివిల్‌ సప్లయ్‌ డైరెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సన్నబియ్యం డెలివరీతో పాటు డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్ల నుంచి ప్రభుత్వ బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల డీసీఎస్‌ఓలు, డీఎంలతో నిర్వహించిన సమీక్షలో ధాన్యం సేకరణ, సన్నబియ్యం డెలివరీ, బకాయిల రికవరీ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. పెండింగ్‌ సన్నబియ్యాన్ని వెంటనే ప్రభుత్వానికి అందించేలా జిల్లా, మిల్లుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో డెలివరీ పెండింగ్‌ ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

డిసెంబర్‌ 2లోగా బకాయిల వసూలు

జీఓ ఎంఎస్‌ నంబర్‌ 17 ప్రకారం నిర్దేశించిన 45 రోజుల గడువులోగా, అంటే డిసెంబర్‌ 2, 2026లోపు డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి పెండింగ్‌ సన్నబియ్యాన్ని లేదా దానికి సమానమైన నగదును రికవరీ చేయాలని డైరెక్టర్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మిల్లర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బకాయిలు వసూలు చేయాలన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో డిఫాల్ట్‌ మిల్లర్లు అధికంగా ఉన్నందున రికవరీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుని బకాయిలు వసూలు చేయాలని స్పష్టం చేశారు.

సన్నబియ్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం, తూకాల్లో మోసాలకు పాల్పడటం వంటి అక్రమాలను అరికట్టేందుకు నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత దుకాణాలు, మిల్లర్లు, వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని, అవసరమైతే పీడీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (పీఏసీలు) అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బందిని ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. ప్రతి కేంద్రం ఎల్‌–3 గ్రేడింగ్‌ ప్రమాణాలను సాధించినప్పుడే ఓపీఎం ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అన్ని కేంద్రాలు నిర్దేశిత ప్రమాణాలు సాధించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

పెండింగ్‌ సన్నబియ్యం డెలివరీ, మిల్లర్ల బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు

డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి డిసెంబర్‌ 2లోగా బకాయిల రికవరీ

అర్హత, బ్యాంకు గ్యారంటీ ఉన్న మిల్లర్లకే ధాన్యం కేటాయింపు

సివిల్‌ సప్లయ్‌ డైరెక్టర్‌

జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement