లింగాల: ప్రభుత్వ వసతి గృహాలు, కేజీబీవీలకు నాణ్యత లోపించిన నిత్యావసర సరకుల పంపిణీ జరుగుతుండడంతో విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఆయా వసతి గృహాలు, కేజీబీవీలు, ఇతర సంక్షేమ గురుకులాలకు సరకుల పంపిణీని మహారాష్ట్రానికి చెందిన ఓ ఏజెన్సీకి అప్పగించారు. రెండురోజుల క్రితం ఆ ఏజెన్సీవారు మండల కేంద్రంలోని ఓ బాలికల విద్యాలయానికి నిత్యావసర సరకులను సరఫరా చేయగా.. అందులో పలు రకాల వస్తువులలో నాణ్యత లోపించినవిగా కనిపించాయి. ఆ విద్యాలయం వారు 51రకాల సరకుల ఇండెంట్‌ను పంపగా.. అందులో కేవలం 36రకాల వస్తువులను సరఫరా చేశారు. మరో 15రకాల వస్తువులు రాక పోవడంతో విద్యార్థులకు ఏ రకంగా వండి పెట్టాలనేది ఆలోచనలో పడ్డారు. సరఫరా అయిన సరకులలో రవ్వలో పురుగులు కనిపించడంతో దానిని తిరిగి పంపించారు. మంచినూనె తదితర సరకులు రాకపోవడంతో ఇతర వసతి గృహాల నుంచి అరువు తీసుకుంటూ.. కాలం గడుపుతున్నారు. రెండు నెలల క్రితం వరకు జీసీసీ నుంచి సరకులు వచ్చేవని, నాణ్యత లోపిస్తే అడిగే వారమని, ఇతర రాష్ట్రం వారికి ఏజెన్సీ ఇవ్వడం వల్ల ఎవరిని అడగాలో తెలియడంలేదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతగల సరకులు సరఫరా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వసతి గృహాలు, విద్యాలయాల నిర్వాహకులు కోరుతున్నారు. ఈ విషయంలో ఎంఈఓ బషీర్ అహ్మద్‌ను వివరణ కోరగా సరకులలో నాణ్యత లోపించినవి సరఫరా అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అట్టి సరకులను వచ్చిన వాహనంలోనే తిరిగి పంపాలని సూచించడం జరిగినట్లు తెలిపారు.
మహారాష్ట్ర ఏజెన్సీపై అనుమానాలు


