నాగర్‌కర్నూల్: వ్యవసాయ పనుల కోసం పొలా నికి వెళ్లిన రైతు పాముకాటుకు గురై మృతి చెందాడు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా దూరం కావడంతో భార్య, ముగ్గురు కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ విషాద ఘటన మండలంలోని పెద్దముద్దనూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంకల కృష్ణయ్య (42) తన సొంత పొలంలో నీరు పారిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబానికి అండగా నిలిచిన కృష్ణయ్య మృతితో భార్య, ముగ్గురు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో పెద్దముద్దనూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


