రాపిడో..రయ్‌ రయ్‌ | - | Sakshi
Sakshi News home page

రాపిడో..రయ్‌ రయ్‌

Nov 1 2026 5:01 AM | Updated on Nov 1 2026 5:01 AM

జెడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌): బస్సు కోసం నిరీక్షణ.. ఆటో కోసం వెతుకులాట.. వెళ్లాల్సిన చోటుకు చేరుకునే వరకు తిప్పలు.. ఒకప్పుడు పట్టణ ప్రయాణాల్లో ఇవి సాధారణం. ఇప్పుడా పరిస్థితి మారుతోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. రాపిడో యాప్‌లో బైక్‌ లేదా ఆటో బుక్‌ చేసుకుంటే వాహనం మన దగ్గరికే వస్తుంది. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, భూత్పూర్‌ మున్సిపాలిటీల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతోంది. మరోవైపు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

యాప్‌లో బుకింగ్‌.. సులువుగా ప్రయాణం

ప్రయాణికులు ముందుగా తమ సెల్‌ఫోన్‌లోని ప్లే స్టోర్‌ నుంచి రాపిడో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అవసరమైన వివరాలు నమోదు చేసి, వెళ్లాల్సిన ప్రాంతాన్ని ఎంచుకుంటే ప్రయాణ చార్జీ, వాహనం చేరుకునే అంచనా సమయం కనిపిస్తాయి. చార్జీకి అంగీకరించి బుకింగ్‌ చేస్తే సమీపంలోని రైడర్‌ వచ్చి పికప్‌ చేసుకుంటారు. దీంతో తక్కువ దూరాలకు వెళ్లేవారికి, అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారికి ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి.

400కు పైగా బైక్‌లు.. వందల సంఖ్యలో ఆటోలు

మహబూబ్‌నగర్‌ నగరంలో రాపిడోకు చెందిన 400కు పైగా బైక్‌లు ఉండగా, వాటిలో సుమారు 260 క్రియాశీలంగా నడుస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు 365 ఆటోలు సేవలందిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వరకు, పీయూ నుంచి అప్పన్నపల్లి వరకు, క్రిస్టియన్‌పల్లి నుంచి వీరన్నపేట, భూత్పూర్‌ పట్టణం వరకు రాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరిగితే మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

భద్రతకు హెల్మెట్లు

ప్రయాణికులను చేరవేసే క్రమంలో రైడర్లు నిరంతరం రద్దీ రహదారులపై తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటీవల జడ్చర్లలో రాపిడో రైడర్లకు ఎస్పీ జానకి హెల్మెట్లు పంపిణీ చేశారు. రవాణా సౌకర్యాన్ని పెంచడంతో పాటు రహదారి భద్రతా నిబంధనలు పాటించడం కూడా కీలకమని ఈ కార్యక్రమం గుర్తుచేస్తోంది.

రోజుకు 40–50 రైడ్లు..

నా సొంత బైక్‌ను రాపిడో యాప్‌లో నమోదు చేసుకుని మహబూబ్‌నగర్‌లో రైడర్‌గా పనిచేస్తున్నాను. రోజూ 40 నుంచి 50 రైడ్లు వస్తుంటాయి. వీటి ద్వారా రోజుకు సుమారు రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నాను. ఈ ఆదాయంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అయితే నగరంలో రాపిడో సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామందికి వీటి గురించి తెలియదు. దీంతో రైడ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. మరింతమందికి ఈ సేవలపై అవగాహన కల్పిస్తే మాకు ఉపాధి పెరుగుతుంది.

– ఎండీ ఫయాజ్‌, రాపిడో రైడర్‌

రాపిడోతో ఉపాధి దొరికింది

గతంలో వివిధ వ్యాపారాలు చేసి చాలా నష్టపోయాను. చివరకు రాపిడో రూపంలో నాకు ఉపాధి లభించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రైడింగ్‌ ప్రారంభిస్తాను. రోజుకు సుమారు 20 రైడ్లు వస్తుంటాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. రాపిడో వల్ల సొంత బైక్‌తోనే సంపాదించుకునే అవకాశం లభించింది. నష్టాల నుంచి బయటపడేందుకు ఈ పని నాకు ఎంతో తోడ్పడుతోంది.

– శైలేందర్‌సింగ్‌, రాపిడో రైడర్‌

యువతకు

అదనపు ఆదాయం

రాపిడో సేవలు నిరుద్యోగ యువతకు, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసేవారికి అదనపు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. రాపిడో కెప్టెన్‌ యాప్‌లో నమోదు చేసుకుని, అవసరమైన వాహన పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర వివరాలు సమర్పించి రైడర్‌గా సేవలందించవచ్చు. పార్ట్‌టైమ్‌గా పనిచేస్తూ ఖాళీ సమయాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశం ఉంది. పూర్తి సమయం పనిచేసే రైడర్లు రోజుకు రూ.700 నుంచి రూ.1,000 వరకు సంపాదించే అవకాశం ఉందని నిర్వాహక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదాయం రైడ్ల సంఖ్య, పని గంటలు, ఇతర ఖర్చులపై ఆధారపడి ఉంటుంది.

నగరం, పట్టణాల్లో బైక్‌, ఆటో ట్యాక్సీ సేవలు

ప్రయాణికులకు సౌకర్యం.. యువతకు ఉపాధి

మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌లో అందుబాటులోకి సేవలు

యాప్‌లో బుక్‌ చేస్తే ఇంటి ముందుకే బైక్‌, ఆటో

సమయం, ఖర్చు ఆదా.. గమ్యస్థానానికి సులువుగా చేరుకునే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement