అధికార లాంఛనాలతో అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

జడ్చర్ల: జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామ పంచాయతీ పరిధిలోని చాకలిగడ్డ తండాకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ కిషన్‌నాయక్‌ తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందారు. గురువారం తండా శివారులో ఆయనకు సైనిక లాంచనాలతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అంతిమ వీడ్కోలు పలికారు. మృతుడికి భార్య నీల, కుమారుడు పవన్‌ ఉన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జావన్‌ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సైనికులకు దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఆర్‌ఎస్‌ అధికారి శశికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

జేసీబీ, కారు ఢీ..

యువకుడు మృతి

అయిజ: మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మార్కాపురం జిల్లా ఎర్రగొండ పాలెంకు చెందిన సుదర్శన్‌రెడ్డి (26 ) భారత్‌మాల రోడ్డు నిర్మాణం చేపట్టిన మెగా కంపెనీలో ఏఈగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అదే కంపెనీలోని జేసీబీని సుదర్శన్‌ రెడ్డి ప్రయాణిస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో సుదర్శన్‌ రెడ్డి, డ్రైవర్‌ సత్యజిత్‌ కానారేకు తీవ్రగాయాలు కాగా ఇద్దరిని కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున సుదర్శన్‌ రెడ్డి మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ గురుస్వామి తెలిపారు.

సూపర్‌వైజర్‌ మృతి

గట్టు: మండల కేంద్రం సమీపంలో రోడ్డు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న సూపర్‌వైజర్‌ రోడ్డు పక్కన మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. భారత్‌మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా రాయాపురం స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన క్యాంపులో ప్రకాశం జిల్లాకు చెందిన బాలకృష్ణ (40) సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. బాలకృష్ణ గట్టు నుంచి క్యాంపునకు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా స్పృహతప్పి మార్గమధ్యలోని గ్యాస్‌ గోదాం సమీపంలో రోడ్డు పక్కన కిందపడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

గుప్త నిధుల కోసం

తవ్వకాలు

జడ్చర్ల: మండలంలోని కోడుపర్తి శివారులో గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. బోయ జంగయ్యకు చెందిన వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని తెలిపారు. గునపాలతో గుంతలు తవ్వి నిమ్మకాయలు తదితర పూజాసామగ్రిని చిందరవందరగా పారబోశారని పేర్కొన్నారు. తవ్వకాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని సీఐ కమలాకర్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడు దుర్మరణం

వనపర్తి రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కేడీఆర్‌ కాలనీకి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి (32) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. బు ధవారం రాత్రి భోజనం అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో మహిళా కళాశాల రోడ్డుపై ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడింది. ప్రమాదంలో తల కు తీవ్రగాయం కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ టనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ

వృద్ధుడు మృతి

వనపర్తి రూరల్‌: వృద్ధుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ హృశికేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్యాలకు చెందిన మాండ్ల చెన్నయ్య(78) కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంటోనే పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు మాండ్ల నాగేంద్రం గురువారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement