తనిఖీలు ముమ్మరం చేస్తాం
మదనాపురం: మార్కెట్ కమిటీ అధికారుల నిఘాకు చిక్కకుండా.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మార్కెట్ ఫీజును ఎగవేస్తూ కొందరు వ్యాపారులు సాగిస్తున్న జీరో దందా మదనాపురం మండలంలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక దళారుల సహకారంతో కర్ణాటకకు చెందిన వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి, గత పది రోజులుగా లారీల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రైతుల వద్దకే దళారులు..
సరిహద్దు దాటుతున్న ధాన్యం
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కొత్తపల్లి, గోపన్‌పేట, కరివెన తదితర గ్రామాల్లో కర్ణాటక వ్యాపారులు స్థానిక దళారుల ద్వారా వడ్ల కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురయ్యే నిరీక్షణ, ధాన్యం ఆరబెట్టడం, తేమ శాతం పేరుతో కోతల భయంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గుచూపుతున్నారు. క్వింటాకు రూ.3,400–3,500 చెల్లిస్తామంటూ, ఇతర కొనుగోలు ధరల కంటే రూ.300–400 అధికంగా ఇస్తామని వ్యాపారులు ఆశ చూపుతున్నట్లు సమాచారం. దీంతో కొత్తపల్లిలో 10 వేలకుపైగా, గోపన్‌పేటలో 5 వేలకుపైగా బస్తాలను సేకరించినట్లు స్థానిక సమాచారం. ఈ రెండు గ్రామాల్లోనే 15 వేలకుపైగా బస్తాలు కొనుగోలు చేసిన వ్యాపారులు.. రోజూ 15 నుంచి 20 లారీల్లో ధాన్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఫీజు చెల్లింపులు లేకుండానే రవాణా సాగుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై మదనాపురం మార్కెట్ సెక్రటరీ సరోజ స్పందిస్తూ.. అనధికారికంగా ధాన్యం తరలిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సంబంధిత వ్యాపారులు, దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మార్కెట్ ఫీజు చెల్లించకుండా ధాన్యం తరలిస్తే లారీలను సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలో తనిఖీలు ముమ్మరం చేస్తామని వెల్లడించారు.
కర్ణాటకకు వడ్ల అక్రమ తరలింపు
10 రోజులుగా యథేచ్ఛగా జీరో దందా
రోజూ 15–20 లారీల్లో
ధాన్యం తరలింపు
క్వింటాకు రూ.300–400 అదనపు ధర ఎర.. మార్కెట్ ఫీజుకు గండి


