దేవరకద్ర: దేవరకద్ర మండలం జీనుగరాల ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని చాకలి రూప రాసిన ‘‘మానవత్వం’’ కథ బాలచెలిమి జాతీయ స్థాయి పిల్లల కథల పోటీల్లో ఎంపికై ందని బాలచెలిమి జిల్లా కన్వీనర్ డాక్టర భీంపల్లి శ్రీకాంత్ ప్రకటనలో తెలిపారు. జీనుగరాల ప్రాథమికోన్నత పాఠశాల నుంచి వెలువడిని మల్లెమొగ్గలు పుస్తకంలో కూడా రూప కథలు రాసిందని తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయికి ఎంపికకావడంతో పలువురు ఉపాధ్యాయులు రూపకు అభినందనలు తెలిపారు.
మనస్తాపంతో
మహిళ ఆత్మహత్య
హన్వాడ: మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అత్యకుంటతండాలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మున్నిబాయి(48) భర్త గతంలోనే చనిపోగా ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఇద్దరు కుమారులు ఉండగా వారు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మున్నిబాయి పని నిమిత్తం సోమవారం జిల్లా కేంద్రానికి వెళ్లి తిరిగొచ్చే క్రమంలో బస్సులో వేరే మహిళ మెడలోని బంగారు గొలుసుకుని అపహరించింది. తోటి ప్రయాణికులు పట్టుకొని మందలించి వదిలేశారు. ఈ విషయం తన కొడుకులకు తెలియడంతో వారు కూడా మందలించడంతో మరుసటిరోజు ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పైపునకు వేలాడుతున్న మున్నిబాయిని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కుమారుడు సభావత్ పురందాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.
చికిత్స పొందుతూ
వివాహిత మృతి
ఖిల్లాఘనపురం: చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన ఖిల్లాఘనపురం మండలం షాపురం గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కేశపాగ కల్పన (27)ను ఏడేళ్ల క్రితం మండలంలోని పర్వతాపురానికి చెందిన ఆటో డ్రైవర్ కృష్ణయ్యకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు వనపర్తిలోని బండారునగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కల్పన అనారోగ్యానికి గురి కావడంతో ఈ నెల 23న పుట్టింటికి వచ్చింది. చికిత్స అనంతరం 25న భర్తతో కలిసి వారి ఆటోలోనే ఊరికి బయలుదేరింది. షాపురం స్టేజి దగ్గరకు రాగానే పుట్టింటికి వెళ్తాను ఆటో ఆపమని చెప్పింది. భర్త మాట వినకపోవడంఆటోలో నుంచి దూకేసింది. దీంతో తలకు తీవ్రగాయాలు కాగా మహబూబ్‌పగర్ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఈ విషయమై మృతురాలి తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.
కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
నారాయణపేట: బీఎస్పీ ఊట్కూర్ మండల అధ్యక్షుడు నర్సింహులు అలియాస్ గౌతమ్ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 23న నారాయణపేట మున్సిపల్ పార్క్ సమీపంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్, బీఎస్పీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో నర్సింహులు ఫిర్యాదు చేయడంతో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ రెడ్డి, బండి ఆనంద్, కాంగ్రెస్ యువ నాయకుడు కుర్వ మనోజ్, గడ్డం వినోద్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


