ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ

Oct 29 2026 12:42 AM | Updated on Oct 29 2026 12:42 AM

● లీగ్‌ దశలో నాలుగు మ్యాచ్‌లు

గెలుపొందిన పాలమూరు

● సెమీస్‌కు చేరిన మహబూబ్‌నగర్‌–

రంగారెడ్డి, మెదక్‌– ఖమ్మం జట్లు

● నేడు సెమీఫైనల్స్‌

గద్వాల న్యూటౌన్‌: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న 70వ రాష్ట్రస్థాయి అండర్‌–17 క్రికెట్‌ టోర్నీ లీగ్‌ దశ ఉత్కంఠభరితంగా సాగింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు చెందిన పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మూడు రోజులపాటు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిన ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఈ క్రమంలో టోర్నీ నుంచి ఆరు జట్లు నిష్క్రమించగా.. మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి, మెదక్‌– ఖమ్మం జట్లు సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. మహబూబ్‌నగర్‌ జట్టు లీగ్‌ దశలో నాలుగు మ్యాచ్‌లలో గెలుపొంది టోర్నీ ఫేవరేట్‌గా నిలిచింది. బుధవారం ఇండోర్‌, సోమనాద్రి రెండు స్టేడియాలలో 8 లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. అంతకు ముందు డీవైఎస్‌ఓ రామలింగేశ్వర్‌గౌడ్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు గద్వాలకు వచ్చి ఆడటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శ్రీనివాసులు, పరిశీలకుడు డేవిడ్‌ సన్‌, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

గెలుపు కోసం..

టోర్నీలో గెలుపు కోసం పలు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఖమ్మం జట్టు ఆరు వికెట్ల తేడాతో వరంగల్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వరంగల్‌ 110 పరుగులు చేయగా, ఖమ్మం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచ్‌లో మొదక్‌ 11 పరుగుల తేడాతో నల్లగొండపై విజయం సాధించింది. మెదక్‌ 124 పరుగులు చేయగా.. నల్లగొండ జట్టు 111 పరుగులకే పరిమితమైంది. – అదిలాబాద్‌ జట్టు నిజామాబాద్‌పై గెలిచింది. తొలుత బ్యాంటింగ్‌కు దిగిన నిజామాబాద్‌ 94 పరుగులు చేయగా అదిలాబాద్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు హైదరాబాద్‌పై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో కరీంనగర్‌ హైదరాబాద్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఫేవరేట్‌గా పాలమూరు జట్టు..

మంగళవారం నిజామాబాద్‌పై మొదటి లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన మహబూబ్‌నగర్‌ జట్టు బుధవారం మూడు మ్యాచ్‌లు అదిలాబాద్‌, నల్లగొండ, మెదక్‌ జట్లపై ఆడి గెలుపొందింది. నాలుగు లీగ్‌ మ్యాచ్‌లలో గెలిచి టోర్నీ ఫేవరేట్‌గా నిలిచింది. రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ 38 పరుగుల తేడాతో అదిలాబాద్‌పై సునాయసంగా గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 145 పరుగులు చేసింది. 78 పరుగులకు అదిలాబాద్‌ను ఆలౌట్‌ చేసింది. మూడో మ్యాచ్‌లో నల్లగొండపై మహబూబ్‌నగర్‌ అలవోకగా గెలుపొందింది. తొలుత ఆడిన నల్లగొండ 79 పరుగులు చేయగా.. నాలుగు వికెట్ల తేడాతో మహబూబ్‌నగర్‌ లక్ష్యాన్ని ఛేదించింది. చివరి మ్యాచ్‌లో మెదక్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్‌ ఆరు వికెట్లకు 96 పరుగులు చేయగా.. నల్లగొండను 78 పరుగులకు ఆలౌట్‌ చేసింది. మహబూబ్‌నగర్‌ జట్టులో హమ్మద్‌, వెంకటసాగర్‌, ధనుష్‌, సాయిరాం బౌలింగ్‌లో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement