● ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆగ్రహం
జడ్చర్ల: ఎమ్మెల్యేగా ఎన్నికై వెయ్యి రోజులు గడుస్తున్నా పాత ఆరోపణలతో కాలం వెళ్లదీయడం మానుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బుధవారం జడ్చర్ల ఏరియా ఆస్పత్రిని సందర్శించి, నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి గతంలో తన సొంత డబ్బు ఖర్చు చేసి స్థలం సిద్ధం చేశానని లక్ష్మారెడ్డి తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో రోడ్డు ఎత్తు పెరగడంతో ఆస్పత్రి దిగువన ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్మాణంలో వాస్తు పాటించలేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. పట్టణ నడిబొడ్డున మూడు ఎకరాల స్థలం కేటాయిస్తే సొంత ఖర్చుతో ఆస్పత్రి నిర్మిస్తానని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మార్వో, క్యాంపు కార్యాలయాలను తొలగించి ఆస్పత్రికి స్థలం కేటాయిస్తామన్న ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం స్థలాన్ని అధికారికంగా అప్పగించిన వెంటనే భూమిపూజ చేస్తానన్నారు. పాత ఆస్పత్రి భవనంలోనూ ఓపీ సేవలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. వంద పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించలేకపోయారని లక్ష్మారెడ్డి విమర్శించారు. మార్చురీలో మృతదేహాల నిర్వహణపై గతంలోనూ, ఇటీవలా వివాదాలు తలెత్తాయని పేర్కొంటూ ఆస్పత్రి నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు. సిబ్బంది నియామకం చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
నిధులు, హామీలపై విమర్శలు
గంగాపూర్–బాలానగర్ రహదారి పనులకు తమ హయాంలో రూ.56 కోట్లు మంజూరు కాగా, అదే పనులకు మరో రూ.20 కోట్లు పెంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుత్తేదారుకు అప్పగించారని ఆరోపించారు. పెంచిన నిధులు పంచుకునేందుకే ఎమ్మెల్యే ఆమరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరతీశారని విమర్శించారు. గురువు కోసం తల నరుక్కుంటానన్న ఎమ్మెల్యేకు మంత్రి కోమటిరెడ్డి నిధులు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. ఆరు నెలల్లో మూడుసార్లు జడ్చర్లకు వచ్చిన ముఖ్యమంత్రిని కనీసం ఒక్క రూపా యి నిధులైనా అడగకపోవడం ఎమ్మెల్యే అసమర్థత కు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కొల్లూరును మండలంగా ఏర్పాటు చేయడం, రాజాపూర్ మండ ల కాంప్లెక్స్ నిర్మాణం, కాలుష్య పరిశ్రమలపై చర్య లు వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో ఆస్పత్రి నిర్మాణానికి స్థలం అప్పగించాలని కోరారు. హామీలు నెరవేరే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, దేవ, నాగిరెడ్డి, ప్రణీల్, మురళి, శ్రీనివాస్, అంజిబాబు పాల్గొన్నారు.


