● అన్ని శాఖల అధికారులు
సమన్వయంతో పనిచేయాలి
● మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తా
జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా జిల్లాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11 నుంచి 21 వరకు జరిగే ఈ క్రీడా పోటీల్లో దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయని, సుమారు 300 మంది క్రీడాకారులు జిల్లాకు రానున్నారని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. క్రీడా ప్రాంగణం, ఇండోర్ స్టేడియం సహా పోటీలకు గుర్తించిన వేదికలను పరిశీలించి, అవసరమైన మౌలిక సదుపాయాల పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్రీడాకారుల వసతి కోసం గుర్తించిన హాస్టళ్లు, భవనాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి కల్పించడంతోపాటు కోచ్‌లు, సహాయక సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వసతి కేంద్రాల నుంచి క్రీడా వేదికలకు రవాణా కోసం బస్సులను సిద్ధం చేయాలని, వైద్య బృందాలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి వసతి కేంద్రానికి సమన్వయ అధికారిని నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. పోటీలను విజయవంతంగా నిర్వహించి జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ హరిప్రియ, డీఆర్వో నిర్మల, జిల్లా అటవీ అధికారి ఎం.నవీన్‌రెడ్డి, జిల్లా క్రీడలు, పర్యాటక శాఖ అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


