వనపర్తి: లైంగిక నేరాలకు పాల్పడిన కేసులలో దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని ఎస్పీ డి.సునిత రెడ్డి ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, లైంగిక నేరాల కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐ/సీ డీఐజీ విశ్వ జిత్ కంపటి అధికారులకు సూచించారు. జిల్లా మహిళా భద్రతా విభా గం పనితీరు, ఆర్థిక నిర్వహణ, భరో సా కేంద్రాల నిర్వహణ, మహిళలు, బాలికలపై జరిగే లైంగిక నేరాల కేసుల దర్యాప్తు పురోగతిపై బుధవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యాచారం, పోక్సో కేసుల్లో నిర్ణీత గడువులోగా, ముఖ్యంగా 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తు పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఐటీఎస్ఎస్ఓ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వనపర్తి జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాల విషయంలో తక్షణమే స్పందించి, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, భరోసా ఎస్ఐ అంజద్, షీ టీమ్స్ సిబ్బంది, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


