లెదర్‌ పార్కులు.. ఏళ్లుగా పడకేశాయి! | - | Sakshi
Sakshi News home page

లెదర్‌ పార్కులు.. ఏళ్లుగా పడకేశాయి!

Oct 29 2026 12:36 AM | Updated on Oct 29 2026 12:36 AM

జడ్చర్ల: దళిత యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం.. చర్మ ఉత్పత్తుల తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం.. వెరసి లెదర్‌ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థలాలు కేటాయించింది.. భవనాలు నిర్మించింది.. యంత్ర సామగ్రిని సమకూర్చింది.. నిరుద్యోగ యువతకు శిక్షణ కూడా ఇచ్చింది. కానీ, పరిశ్రమలు మాత్రం ఏర్పాటు కాలేదు. ఉపాధి అవకాశాలు అందలేదు. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని పోలేపల్లి, జినుకుంట లెదర్‌పార్కుల లక్ష్యం నెరవేరకుండానే పోయింది. కోట్ల విలువైన భూములు, లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు, యంత్రాలు నిరుపయోగంగా మారాయి.

శిక్షణ ఇచ్చారు.. ఉపాధి మరిచారు

చర్మ ఉత్పత్తుల తయారీలో నైపుణ్యం పెంచేందుకు నిరుద్యోగ దళిత యువతకు శిక్షణ ఇచ్చారు. కొందరిని చైన్నెకి పంపించి శిక్షణ ఇప్పించగా, జడ్చర్ల పారిశ్రామిక పార్కులో సుమారు 250 మందికి శిక్షణ అందించారు. శిక్షణ సమయంలో నెలకు రూ.1,500 చొప్పున స్టైపెండ్‌ చెల్లించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.7,500 రుణసదుపాయం కల్పించారు. జినుకుంటలోనూ సుమారు 400 మందికి శిక్షణ ఇచ్చారు. లెదర్‌ పార్కుల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. అయితే పరిశ్రమలే ప్రారంభం కాకపోవడంతో శిక్షణ పొందిన యువతకు ఆశించిన ప్రయోజనం దక్కలేదు.

రూ.60 లక్షలు ఏమయ్యాయి?

లిడ్‌క్యాప్‌ శిక్షణ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2022లో రూ.60 లక్షలు కేటాయించినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. సీఎల్‌ఆర్‌ఐ (సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల కోసం ఈ నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. అయితే ఆ నిధుల వినియోగం, శిక్షణ కేంద్రం పునఃప్రారంభం, ప్రస్తుత పురోగతిపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీఐఐసీకి అప్పగింత.. మళ్లీ లిడ్‌క్యాప్‌కు

పోలేపల్లి భూమిని 2008లో లెదర్‌ పార్కు ఏర్పాటుకు లిడ్‌క్యాప్‌ అప్పటి ఏపీఐఐసీకి అప్పగించింది. అయితే అక్కడ పరిశ్రమల అభివృద్ధి ముందుకు సాగలేదు. దీంతో 2013లో ప్రభుత్వం ఆ భూమిని ఏపీఐఐసీ నుంచి వెనక్కి తీసుకుని తిరిగి లిడ్‌క్యాప్‌కు బదలాయించింది. భూమిని స్వాధీనం చేసుకున్న సంస్థ ఆ తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో 25 ఎకరాలు నిరుపయోగంగానే మిగిలాయి. మరోవైపు పోలేపల్లి భూమి సెజ్‌, జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో దాని మార్కెట్‌ విలువ భారీగా పెరిగింది. స్థానికంగా ఎకరం ధర రూ.3 కోట్లకు పైగా పలుకుతున్నట్లు అంచనా. ఇంత విలువైన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు, అసలు లక్ష్యమైన పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చర్మ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను వినియోగించుకుంటూ లెదర్‌ పార్కులను అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే వీలుంది. పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించడం, యంత్రాలను పునరుద్ధరించడం, శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం, పెట్టుబడిదారులను ఆకర్షించడం వంటి చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఉపాధి అవకాశాలు కల్పించాలి

చర్మ ఉత్పత్తుల తయారీలో పొందిన శిక్షణ నిరుపయోగంగా మారింది. శిక్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, లెదర్‌ పార్కుల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలు తమ జీవితాలకు బాటలు వేస్తాయని ఆశించాం. కానీ పాలకులు వీటి అభివృద్ధిపై దృష్టి సారించలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. – కృష్ణయ్య,

చర్మకారుల సంఘం అధ్యక్షుడు, జడ్చర్ల

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో లెదర్‌ పార్కు అభివృద్ధికి చర్యలు చేపడతాం. ఇప్పటికే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిధులు విడుదల కాలేదు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, దళితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తాం.

– అనిరుధ్‌రెడ్డి,

ఎమ్మెల్యే, జడ్చర్ల

ఉపాధి హామీ ఉత్తిమాటే..

పోలేపల్లి, జినుకుంటలో 50 ఎకరాలు నిరుపయోగం

రూ.2 కోట్లతో యంత్రాలు.. శిథిలావస్థలో భవనాలు

శిక్షణ పొందినా దక్కని ఉపాధి.. ప్రశ్నార్థకంగా ప్రభుత్వ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement