జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): కొత్త చేయూత పింఛన్ల కోసం జిల్లాలో వేలాది మంది పేదలు ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ప్రస్తుతం అందిస్తున్న మొత్తాన్ని పెంచుతామన్న ఎన్నికల హామీ అమలుపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జూన్ 2, ఆగస్టు 15, దసరా.. ఇలా పలు సందర్భాల్లో పింఛన్లు వస్తాయని ఆశించినా నిరీక్షణ తప్పడం లేదని వాపోతున్నారు.
హామీలు సరే.. మంజూరు ఏదీ?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించింది. కొత్త పింఛన్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించినా, వాటి మంజూరుపై స్పష్టత లేకపోవడంతో అర్హులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
13,325 దరఖాస్తులు అర్హం
జిల్లాలో కొత్త పింఛన్ల కోసం మొత్తం 15,572 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15,571 ట్యాగింగ్ పూర్తికాగా, వెరిఫికేషన్ స్థాయిలో 13,325 దరఖాస్తులను అర్హమైనవిగా గుర్తించారు. మరో 969 దరఖాస్తులు అనర్హమైనవిగా తేల్చగా, 713 దరఖాస్తులను హోల్డ్‌లో ఉంచారు. మరో 79 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్హత పొందిన 13,325 దరఖాస్తులు ప్రస్తుతం డీఆర్‌డీఓ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే పింఛన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచి మంజూరు చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో నిరీక్షణ కొనసాగుతోంది.
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో పింఛన్ల దరఖాస్తుల
డేటా ఎంట్రీని పరిశీలిస్తున్న డీపీఎం రామునాయక్
ప్రభుత్వ ఆదేశాలు రాగానే పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద చేయూత పింఛన్ల పథకం అమలు చేస్తోంది. దరఖాస్తులు తీసుకొని అర్హతమైనవి గుర్తించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పింఛన్లు పంపిణీ చేస్తాం. – నర్సింహులు, డీఆర్‌డీఓ
మూడేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరుపై స్పష్టత కరువు
పండుగల వేళ ఆశలు.. ఆ తర్వాత నిరాశ
జిల్లాలో 13,325 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తింపు


