జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పట్టభద్ర ఓటరు నమోదు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. జిల్లాలో పట్టభద్ర ఓటర్ల నమోదు తక్కువగా ఉందని, డిగ్రీ పూర్తి చేసిన అర్హులందరూ వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో ఓటు వేసినవారు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఉచిత నమోదు కేంద్రాలను వినియోగించుకోవాలని, నవంబర్ 6లోగా ఓటరు జాబితాలో పేర్లు నమోదయ్యేలా పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో చొరవ చూపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు ఖలీం, సిద్ధిక్, బషీర్, శ్రీనివాస్‌రెడ్డి, మక్సూద్, సుధాకర్, సత్యం యాదవ్, శివ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


