● ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిని ప్రశ్నించిన దివ్యాంగుడు
● ‘అది స్టేట్ పాలసీ.. నేనొక్కడినే హామీ ఇవ్వలేను’ అన్న ఎమ్మెల్యే
నవాబుపేట: పెరిగిన అవసరాలు.. పరిమితమైన ఆదాయం.. ఇతరులపై ఆధారపడకుండా గౌరవంగా బతకాలన్న తపన.. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారంటూ ఓ దివ్యాంగుడు ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. తమకు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందో చెప్పాలని వినతిపత్రం అందజేశాడు. బుధవారం నవాబుపేట మండల పర్యటనకు వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిని లింగంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు నేర్లపల్లి రమేశ్ కలిసి పింఛన్ పెంపుపై వినతిపత్రం ఇచ్చాడు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఎప్పటి నుంచి అందిస్తారని అడిగాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. అది స్టేట్ పాలసీ, తానొక్కడినే హామీ ఇవ్వలేనని తెలిపారు. అయితే దివ్యాంగుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించి, పింఛన్ పెంపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


