అడ్డాకుల: వచ్చే ఏడాది జూన్ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కర్వెన రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకొచ్చి నింపుతామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బలీదుపల్లి శివారులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్యాకేజీ–3 పనులు ప్రారంభమయ్యాయని, అవి పూర్తయితే కర్వెనకు నీరు వస్తుందని పేర్కొన్నారు. కందూర్ పెద్దవాగుకు నీరు రాకపోవడానికి మాజీ ఎమ్మెల్యేనే కారణమని ఆరోపించారు. డీ–8, డీ–12, డీ–13 డిస్ట్రిబ్యూటరీ కాలువల వద్ద అసంపూర్తి పనులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో మాట్లాడి పూర్తి చేయిస్తామని, తద్వారా అదనంగా 7 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అడ్డాకుల మార్కెట్ యార్డు పనులు వేగవంతమయ్యాయని, కొత్త భవనం పూర్తయ్యే వరకు పాత గ్రామ పంచాయతీలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మదనాపురం మార్కెట్ యార్డు చైర్మన్ ప్రశాంత్, పార్టీ అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు.


